- ఈ నెల15 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు
- జూన్ 3న సీట్ల కేటాయింపులు
- జులై 8 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు
- ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగు కొత్త కోర్సులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. 2024–25 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లను మూడు విడతల్లో చేపట్టనున్నామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటించింది. రాష్ట్రంలోని దోస్త్ ద్వారా 8 సర్కారు యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం మే 3తో ప్రారంభమైన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ.. జులై 5తో ముగియనున్నది.
జులై 8 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్ ను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. వీటితో పాటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డీ– ఫార్మసీ కోర్సుల్లోనూ దోస్త్ ద్వారానే ఆన్ లైన్ అడ్మిషన్లు చేపడతామని వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా ఈజీ..
దోస్త్ వెబ్ సైట్ https://dost.cgg.gov.in ద్వారా విద్యార్థులు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. స్టూడెంట్ మొబైల్ నంబర్ కు ఆధార్ లింక్ చేసి ఉంటే, నేరుగా తమ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ద్వారా దోస్త్ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. ఇక ఫేజ్-1 లో మే 6 నుంచి జూన్ 25 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 15 నుంచి మే 27 వరకు వెబ్ ఆప్షన్స్, మే 24, 25 స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 3న ఫేజ్-1 సీట్ల కేటాయింపు చేస్తారు. జూన్ 4 నుంచి 10 వరకూ ఆన్లైన్లో విద్యార్థులు స్పెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 8 నుంచి డిగ్రీ ఫస్టియర్ తరగతులు ప్రారంభమవుతాయి.
డిగ్రీలో మరో 4 కొత్త కోర్సులు
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మరో నాలుగు కొత్త కోర్సులను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీసుకొచ్చింది. 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా బీఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, బీకామ్ ఫైనాన్స్, బీఏ (హెచ్ఈపీ) స్పెషల్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. నిరుడు 26 కాలేజీల్లో సెక్టార్ స్కిల్ కోర్సులను నిర్వహిస్తుండగా, ఈసారి మరో 14 కొత్త కాలేజీలను హయ్యర్ ఎడ్యుకేషన్ అనుమతి ఇచ్చింది.