అమ్మానాన్న క్షమించండి..యముడు పిలుస్తుండు.. నేను వెళ్తున్నా..!

అమ్మానాన్న క్షమించండి..యముడు పిలుస్తుండు.. నేను వెళ్తున్నా..!
  • సూసైడ్ నోట్ రాసి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య 
  •  రాజన్న సిరిసిల్ల జిల్లా ధర్మారంలో విషాదం.

కోనరావుపేట,వెలుగు: “ అమ్మానాన్న.. క్షమించండి.. నన్ను యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. బై.. బై..” అంటూ డిగ్రీ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల మంజుల, బాలమల్లు దంపతులు తమ పెద్ద కొడుకు రాకేశ్(19) ను హైదరాబాద్ లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేర్పించారు.

మూడు రోజుల కింద రాకేశ్ ఇంటికి ఫోన్ చేసి చదువుకోవడం ఇష్టం లేదని చెప్పాడు. తల్లిదండ్రులు రమ్మనడంతో శనివారం అతడు హైదరాబాద్ నుంచి లగేజీతో సిరిసిల్లకు వెళ్లాడు. సొంతూరు వెళ్లే ఆటో డ్రైవర్ కు బ్యాగ్ ఇచ్చి అతడు ఎటో వెళ్లిపోయాడు. కొడుకుకు తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో అదే రోజు  సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే ట్రాక్ పై పడి రాకేశ్​సూసైడ్ చేసుకున్నాడని రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాకేశ్​మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.