
- రూ.1100 దొంగిలించాడని నిందవేసిన తోటి విద్యార్థులు
- వార్డెన్‌తో పాటు ఐదుగురు స్టూడెంట్లపై కేసు
బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ మండలంలో దొంగ అంటూ తోటి స్టూడెంట్లు ముద్ర వేయడంతో అవమానభారంతో ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్యాంపటేల్ కథనం ప్రకారం..జోగాపూర్గ్రామానికి చెందిన కామెర ప్రభాస్(20) మందమర్రి జోన్–2 లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ మంచిర్యాలలోని సీవీ రామన్కాలేజీలో డిగ్రీ ఫస్టియర్చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం ప్రభాస్ రూ.1100 దొంగిలించాడంటూ తోటి విద్యార్థులు అతడి బ్యాగును చెక్‌చేసి అందులోని డబ్బులను తీసుకున్నారు. దొంగ అని ముద్ర వేయడంతో మనస్తాపానికి గురైన ప్రభాస్ బుధవారం ఉదయం నెన్నెల మండలం జోగాపూర్లోని తన ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి తర్వాత బయటకు వచ్చి కిందపడిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు ప్రభాస్‌ను ఏమైందని ప్రశ్నించారు. దీంతో అతడు జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే అతడిని108లో బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లగా గురువారం మధ్యాహ్నం కన్నుమూశాడు. మృతుడి అన్న రాజశేఖర్ఫిర్యాదు మేరకు హాస్టల్వార్డెన్తో పాటు ఐదుగురు స్టూడెంట్స్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
స్టూడెంట్ యూనియన్ల ధర్నా
మృతుడు ప్రభాస్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ఎదుట స్టూడెంట్ యూనియన్లు ధర్నాకు దిగాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ తోపాటు, ప్రభాస్చావుకు కారణమైన తోటి విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశాయి. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌చేశారు.