![డిగ్రీలు, పీజీలు చదివి హమాలీ పనికి](https://static.v6velugu.com/uploads/2022/01/Degrees,-PGs-for-Hamali-works-in-telangana_vAiBp56zXw.jpg)
ఏనుమాముల మార్కెట్లో గ్రాడ్యుయేట్లే 1,500 మంది
ఏండ్లుగా జాబ్ నోటిఫికేషన్లు లేక బస్తాలు మోస్తున్నరు
ఒక్కో బస్తా లారీ ఎక్కిస్తే.. పత్తికి రూ. 3, మిర్చికి రూ.5
వరంగల్, వెలుగు:
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో డిగ్రీలు, పీజీలు చదివినోళ్లు కూడా వరంగల్లోని ఏనుమాముల మార్కెట్లో హమాలీ పని చేస్తున్నారు. పత్తి, భగభగమండే మిర్చి బస్తాలు మోయడానికి ఖరీద్దారు దగ్గర కూలీలుగా చేరుతున్నారు. కాంటా వేసిన ఒక్కో బస్తాను లారీలో లోడు చేయడానికి రూ. 3 నుంచి 5 చొప్పున ఇస్తుండటంతో కష్టకాలంలో అదే పదివేలుగా భావిస్తున్నారు. జనవరి నుంచి మిర్చి సీజన్ మొదలు కావడంతో నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలనే ఆరాటంలో తిండి తిప్పలుమాని ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. మార్కెట్ నుంచి వేలకొద్దీ బస్తాలు తరలించే క్రమంలో మిర్చి ఘాటుకు వీపులు మండుతున్నప్పటికీ వ్యాపారులు అప్పజెప్పిన లోడ్ పూర్తవ్వడానికి కొందరు ఏం తక్కువన్నా 18 గంటలు కూడా కష్టపడుతున్నారు.
ఎక్కువ బస్తాలు మోస్తరని..
వరంగల్ ఏనుమాముల మార్కెట్లో లైసెన్స్ కలిగిన ఖరీద్దారులు 400 మంది ఉండగా.. కమీషన్ ఏజెంట్లు మరో 500 నుంచి 600 మంది దాకా ఉన్నారు. వీరి దగ్గర రెగ్యులర్‍గా పని చేసేందుకు 2 వేల నుంచి 3 వేల మంది హమాలీలు అందుబాటులో ఉంటారు. కాగా, సీజన్‍లో ఏనుమాముల మార్కెట్‍కు చుట్టుపక్క జిల్లాల నుంచి రోజుకు 40 వేల నుంచి 50 వేల పత్తి బస్తాలు, మిర్చి అయితే ఒక్కరోజే 50 వేల బస్తాల నుంచి లక్ష వరకు వస్తాయి. దీంతో కాంటా వేసిన బస్తాలను ఎప్పటికప్పుడు లారీల్లో లోడ్ చేసి మార్కెట్ నుంచి బయటకు తరలించాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారులు వేగంగా పనిచేసే యూత్ వైపు చూస్తున్నారు.
(మొదటి పేజీ తరువాయి)
తక్కువ టైంలో ఎక్కువ బస్తాలు మోస్తారనే ఉద్దేశంతో వారిని హమాలీ పని చేయడానికి తీసుకుంటున్నారు.
డిగ్రీలు, పీజీలు చేసినోళ్లే 1,500 మంది
ఏనుమాముల మార్కెట్లో మొదట్లో 500 మందితో మొదలైన స్టూడెంట్, యూత్ హమాలీల సంఖ్య మిర్చి సీజన్‍గా భావించే ఫిబ్రవరి, మార్చి నెల వచ్చే నాటికి.. దాదాపు 2,500 మందికి చేరుతోంది. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినవాళ్లు ఇక్కడ హమాలీ పని కోసం వస్తున్నారు. ఊర్లలో ఒకరిని చూసి మరొకరు పని చేయడానికి వస్తుండడంతో రానురాను వీళ్ల సంఖ్య పెరుగుతున్నది. జాబ్స్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువకులకు నోటిఫికేషన్లు రాకపోవడంతో ఏం చేయాలో అర్థమవక ఇక్కడ హమాలీ పనిని రెండు, మూడు నెలలు ఉపాధిగా భావిస్తున్నారు. మిర్చి సీజన్‍లో తక్కువలో తక్కువ 2,500 మంది యూత్ హమాలీ పనికోసం వస్తుండగా.. వీరిలో 1,000 మంది వరకు టెన్త్, ఇంటర్‍లోపు చదివినవాళ్లుంటే, మరో 1,500 మంది డిగ్రీ, పీజీలు పూర్తి చేసినవాళ్లు ఉంటున్నారు.
ఏనుమాముల మార్కెట్లో కాంటా వేసిన బస్తాలను లారీలో లోడ్ ఎక్కించే హమాలీలకు పత్తి బస్తాకు 3 నుంచి 4 రూపాయలు చెల్లిస్తున్నారు. మిర్చి బస్తాకు ఆ రోజు డిమాండ్ ఆధారంగా రూ. 5 నుంచి 6 వరకు ఇస్తున్నారు. ఈ లెక్కన డైలీ 100 బస్తాలు లారీల్లో లోడ్ చేస్తే తప్పితే నాలుగైదు వందలు జేబులోకి వచ్చే పరిస్థితి లేదు. కష్టకాలంలో ఇంటోళ్ల మంచిచెడు చూసుకునే బాధ్యతలు ఉన్నోళ్లు.. కోచింగ్ ఫీజు కోసం డబ్బులు పనికొస్తాయని భావించేవాళ్లయితే పగలు, రాత్రి తేడా లేకుండా ఎక్కువ గంటలు హమాలీ పని చేస్తున్నారు. బయట రూ. 5కు దొరికే 'అన్నపూర్ణ' బండిలో అన్నం తిని.. పత్తి బస్తాలపై మూడునాలుగు గంటలు కునుకు తీస్తున్నారు. వీళ్లంతా ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అని ఎదురుచూస్తున్నవాళ్లే.
నోటిఫికేషన్లు లేక
హమాలీ పనికొచ్చిన
నేను బీబీఎం చదివిన. డిస్టెన్స్ లో పీజీ చేస్తూనే జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేరైన. నాలుగైదేండ్లుగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తలేదు. ఇట్లయినా నాలుగు రూపాయలు వస్తయన్న ఆశతోటి మార్కెట్లో హమాలీ పని చేస్తున్న. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న.
- చరపల్లి మహేశ్, వరంగల్
ఐదేండ్లుగా ఈ సీజన్‍లో
పనికి వస్తున్న
నేను బీకాం కంప్యూటర్స్ చదివిన. ఇంట్లో ఖర్చులకు తోడు కోచింగ్ సెంటర్ ఫీజుల కోసం పని కొస్తుందని ఐదేండ్లుగా పత్తి, మిర్చి సీజన్‍లో మార్కెట్ పనికి వస్తున్న. డిగ్రీ క్వాలిఫికేషన్‍తో జాబ్ పడితే కొట్టాలని వెయిట్ చేస్తున్న.
- సిలివేరు కల్యాణ్, వరంగల్
రోజువారీ కూలీగా చేరిన
నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక జాబ్ నోటిఫికేషన్లు వస్తయని నాలుగైదేండ్లు ప్రిపేర్ అవుతూ ఎదురుచూసిన. నోటిఫికేషన్లు లేక.. జాబ్స్ రాక.. ఖాళీగా ఉంటున్నడనే పేరొచ్చింది. దీంతో మార్కెట్లో రోజువారీ కూలీగా చేరిన. కాంటాల దగ్గర వెయిట్ చూడటం.. దాన్ని సరిగ్గా రాసుకునుడు నా పని. రోజుకు రూ.300 కట్టిస్తున్నరు.
- పోలెపాక సాగర్, వరంగల్
సీజన్‍లో ఎక్కువ మంది హమాలీ పనికి వస్తరు
నా దగ్గర 10 నుంచి 12 మంది రెగ్యులర్ హమాలీలు పనిచేస్తరు. మిర్చి సీజన్‍లో రోజూ వేలల్లో బస్తాలు వస్తయి. వాటిని లోడ్ చేయాల్నంటే అంతే స్థాయిలో మోసెటోళ్లు అవసరం. ఫిబ్రవరి, మార్చి టైంలో నా దగ్గరకు ఏం లేదన్న 100 మంది కంటే ఎక్కువే పనికి వస్తరు. చదువు ఆధారంగా పెట్టుకునే జాబ్ కాదు కాబట్టి ఏం చదువుకున్నరో అడుగను.
- చింతాలపల్లి వీరారావు, ఖరీదుదారుడు