చలికాలంలో తక్కువ నీళ్లు తాగుతున్నారా.. మీకు ఈ సమస్య రావచ్చు.. జాగ్రత్త

డీ–హైడ్రేషన్.. ఈ పదం ఎండాకాలంలో ఎక్కువగా వింటుంటాం. కానీ, వింటర్​లో కూడాడీ-– హైడ్రేషన్​కి కొంతమంది గురవుతారని  ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. మరి దానికి కారణాలేంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సీజన్​లో హైడ్రేషన్​ ఎలా మెయింటెయిన్​ చేయాలి? వంటి విషయాలను తెలుసుకోవాలంటే ఈ హెల్త్​ స్టోరీ చదవాల్సిందే.  

శీతాకాలంలో చలిని తట్టుకునేందుకు ఉన్ని (ఉలెన్) బట్టలు ఎక్కువగా ధరిస్తుంటాం. మందపాటి దుస్తులు అందుబాటులో లేకపోతే ఒక్కోసారి రెండు మూడు డ్రెస్​లను ఒకదాని మీద ఒకటి వేసుకుంటుంటారు కూడా. ఏదో ఒక విధంగా శరీరాన్ని చలి నుంచి తప్పించేందుకు ఇలాంటివన్నీ చేస్తుంటాం. అందువల్ల బాడీలో వేడి పెరుగుతుంది. వెచ్చగా ఉండడంతో హాయిగా అనిపిస్తుంది. అంత వెచ్చగా ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గి, ఎక్కువగా దాహం వేస్తుంటుంది. కామన్​గా అయితే నీళ్లు బాగా తాగేవాళ్లు కూడా వింటర్​లో మాత్రం సరిగా తాగరు. ఎందుకంటే ఆ చల్లదనానికి దాహం వేసినా నీళ్లు తాగాలనిపించదు. రోజు మొత్తంలో చాలా తక్కువగా నీళ్లు తాగుతారు. దాంతో శ​రీరంలో నీటి శాతం తగ్గి, బాడీ హైడ్రేషన్​ కోల్పోతుంది. దాన్నే డీ-హైడ్రేషన్ అంటాం. 

అయితే దుప్పట్లు, స్వెటర్లు వాడకుండా చలిని తట్టుకునేదెలా? అనుకోవచ్చు. డీ-హైడ్రేషన్​కు​ అదొక్కటే కారణం కాదు.  శారీరక శ్రమ చేయకపోవడమూ కారణమే. దీని​కి వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే పిల్లలు, వృద్ధులు శారీరక శ్రమ ఎక్కువగా చేయలేరు. దానివల్ల వాళ్లకు ఈ కాలంలో దాహం సరిగా వేయదు. కానీ, మిగిలిన వాళ్లు కూడా ఫిజికల్ యాక్టివిటీలు చేయడానికి వెనకడుగేస్తారు. పొద్దున్నే లేవడం, పనులు లేదా ఎక్సర్​సైజ్​లు చేయాలంటే కష్టంగా ఫీలవుతారు. శరీరాన్ని కష్టపెట్టకపోతే దాహం కూడా వేయదు. దప్పికగా ఉన్నా నీళ్ల బదులు ఏదో తినాలనో తాగాలనో అనుకుంటారు. అంటే శారీరక శ్రమ తగ్గిపోవడం, నీళ్లు సరిగా తాగకపోవడం వంటివి డీ–హైడ్రేషన్​కి దారితీస్తాయి. 

లక్షణాలు ఇలా

డీ–హైడ్రేషన్​ని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే.. సాధారణంగా మొదట కనిపించేది నోరు పొడిబారడం. కొందరికి హార్ట్​ రేట్‌‌‌‌‌‌‌‌ పెరిగి, గుండెల్లో దడ వస్తుంటుంది. అయోమయంగా ఉండడం. తలనొప్పి, కళ్లు తిరగడం. యూరిన్​ ముదురు పసుపు రంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తే డీ–హైడ్రేషన్​గా గుర్తించి వెంటనే డాక్టర్​ దగ్గరకి వెళ్లాలి.

హైడ్రేషన్ మెయింటెయిన్

అందరూ సరిపడా నీళ్లు తాగాలి. జలుబు వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా సరే.. కాస్త బయటికి వెళ్తుండాలి. వీలైనంతవరకు శరీరాన్ని కదిలించేలా పనులు లేదా ఎక్సర్​సైజ్​లు చేయాలి. డీ–హైడ్రేషన్ అనేది వింటర్​లోనే కాదు.. వర్షాకాలంలో కూడా చూస్తుంటాం. చల్లని వాతావరణంలో నీళ్లు తాగాలనిపించదు ఎవరికైనా. కానీ, అలాగని తాగకుండా ఉంటే కచ్చితంగా బాడీ డీ– హైడ్రేట్​ అవుతుంది. కాబట్టి గోరు వెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. చిన్నపిల్లలకు కూడా ఒక బాటిల్ ఇచ్చి తాగుతూ ఉండమని చెప్పాలి. అది అందరూ అలవాటు చేసుకోవాలి. 

- డాక్టర్ పి. నితిన్ రెడ్డి  కన్సల్టెంట్​ జనరల్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్​,  రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్