అభ్యర్థి ప్రకటనపై ఎన్కాముందు

  •     బీఆర్ఎస్​ లో విచిత్ర పరిస్థితి
  •     టికెట్ఇస్తామన్నాక ఒకరు, టికెట్ఇచ్చాక ఒకరు ఔట్
  •     చెరో పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతలు
  •     తెరపైకి కొత్తపేర్లు

హనుమకొండ, వెలుగు : ఓరుగల్లులో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన బీఆర్ఎస్.. ఎంపీ ఎలక్షన్స్ లోనైనా గెలిచి పరువు నిలుపుకుందామంటే, అసలు క్యాండేట్లే దొరకని పరిస్థితి నెలకొంది. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామన్నాక ఆరూరి రమేశ్, అభ్యర్థిత్వం ఖరారు చేసిన తరువాత కడియం కావ్య ఇద్దరూ క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీని వీడి, ఇతర పార్టీల నుంచి టికెట్లు దక్కించుకున్నారు.

దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పార్టీని వీడిన వారిని ఓడించి పరువు నిలుపుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తుండగా, అసెంబ్లీ ఫైట్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఉద్యమకారులతోపాటు కొంతమంది కొత్త నాయకుల పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి.

15 రోజుల్లోనే తలకిందులు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కేవలం రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం కాగా, తాజాగా స్టేషన్ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్​కు మిగిలారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్య నేతలంతా హస్తం పార్టీలోకి క్యూ కట్టారు.  ఇందులో గులాబీ పార్టీ ఎంపీ టికెట్ కోసం పరిశీలించిన నేతలు కూడా ఉన్నారు. మొదట బీఆర్ఎస్ ఎంపీ టికెట్​ను  సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఆశించగా, పార్టీ మాత్రం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వైపు ఆలోచించింది.

ఫీల్డ్ లో పార్టీ పరిస్థితులు బాలేకపోవడం, జనాల్లో వ్యతిరేకత ఉండటంతో ఆరూరి టికెట్ నిరాకరించారు. మార్చి 13న కడియం కావ్యకు టికెట్ కన్​ఫామ్​ చేయగా, మార్చి 16న పసునూరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మార్చి 17న ఆరూరి రమేశ్ కమలం కండువా కప్పుకొని, ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారైన కడియం కావ్య ఫీల్డ్ లో నెగటివ్ ఫీడ్​ బ్యాక్​ రావడంతో మార్చి 28న పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ రిలీజ్ చేశారు.

మార్చి 31న కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరూ కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోగా, ఏప్రిల్ 1న హస్తం పార్టీ కావ్యకు టికెట్ కన్ఫామ్ చేసింది. దీంతో ఎంపీ అభ్యర్థులుగా ఉంటారనుకున్న నేతలంతా వెళ్లడంతో బీఆర్​ఎస్​లో కలవరం మొదలైంది.

తెరమీదకు కొత్త పేర్లు..

అసెంబ్లీ ఎన్నికల నుంచి కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తూ వచ్చారు. ప్రధానంగాజోరిక రమేశ్, బోడ డిన్నా తదితరులు ఉండగా, అవకాశం దక్కకపోవడంతోసైలెంట్ గా ఉన్నారు. కడియం కావ్య బయటకు వెళ్లడంతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి భార్య పెద్ది స్వప్న, హనుమకొండ జడ్పీ చైర్మన్​ సుధీర్​ కుమార్​, స్టేట్ మెడికల్ ఇన్​ప్రాస్ట్రక్టర్​ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగా లేవనే పార్టీ నుంచి బయటకు

వెళ్లిన వారు చెప్తుండటంతో కొందరు నేతలు ఆలోచనలో పడ్డారు. దీంతో అభ్యర్థిగా ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అయోమయంలో పడింది. రెండ్రోజుల కిందట వరంగల్ కు వచ్చిన మాజీ మంత్రి హరీశ్​ రావు పార్టీ నేతలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడా ఎవరికీ ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.

రాజయ్యను మళ్లీ తీసుకొస్తారా.?

బీఆర్ఎస్ నుంచి కడియం బయటకు వెళ్లిన తర్వాత స్టేషన్​ ఘన్​పూర్​ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను మళ్లీ బీఆర్​ఎస్​లోకి తీసుకువస్తారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో టికెట్ ఆశించి భంగపడ్డ రాజయ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ వైపు ప్రయత్నాలు చేశారు. ఆశించిన ఫలితం దక్కకపోవడంతో ప్రస్తుతం తటస్థంగానే ఉన్నారు. బీఆర్ఎస్ వరంగల్ స్థానానికి అభ్యర్థి ఖరారు కాకపోవడంతో కొంతమంది నేతలు

రాజయ్యను పార్టీలోకి తీసుకురావాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. మరోవైపు పార్టీ మారిన నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తీసుకునే ప్రసక్తే లేదని ఇటీవల కేటీఆర్ కామెంట్ చేయగా, పార్టీ మారినోళ్లను తీసుకోబోమని వరంగల్​ లో హరీశ్​ రావు కూడా స్పష్టం చేశారు. దీంతో రాజయ్యకు రీ ఎంట్రీ ఉండదనే అభిప్రాయాలు కూడా నిపిస్తున్నాయి.కలెక్టర్​ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి

పరువు కోసం ప్రయత్నాలు

తమ పార్టీని కాదని వెళ్లిన నేతలను ఓడించి పరువు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. కాంగ్రెస్​ లో టికెట్ ఆశించి భంగపడ్డ ఓ నేతను బీఆర్ఎస్​ లోకి తీసుకొచ్చి టికెట్ కేటాయించే ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని వీడి రావడానికి ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఇంకో 40 రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ జరగనుండగా, ఇప్పటికే వరుస దెబ్బలతో చతికిలపడిన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపుతుందో చూడాలి.