- రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంలో ఆలస్యం
- వాన కాలంలో అవస్థలు
- ఏజెన్సీ వాసులకు తప్పని తిప్పలు..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మారుమూల అటవీ ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో గ్రామాల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, బ్రిడ్జిలు మంజూరైనా అటవీ అనుమతులు ఆలస్యం అవుతుండటంతో పనులు ముందకు సాగడం లేదు. ఏటా వానా కాలం వస్తుందంటే చాలు ఏజెన్సీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వానాకాలం వచ్చిందంటే కష్టాలే..
జిల్లాలోని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు పోలీస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు దృష్టి సారించాయి. కానీ, అనుమతులు ఇవ్వకుండా అటవీ శాఖ ఈ పనులకు అడ్డం పడుతోంది. ఆయా చోట్ల ప్రారంభం అయిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఏజెన్సీ ఏరియాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చిన్నపాటి వర్షం పడ్డా రోడ్లన్నీ బురదమయం అవుతాయి. వానాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగిపోయిన పనులు..
- జిల్లాలోని చర్ల మండలంలోని దేవరపల్లి టూ కుర్కుడ్పాడు వెళ్లే దారిలో రూ. కోట్లతో చేపట్టిన 5కిలోమీటర్ల రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది.
- మూడు బ్రిడ్జిలు, కుర్కుడ్పాడ్ నుంచి చింతలపాడు మధ్య రూ. 1.50కోట్లతో చేపట్టిన మూడు కిలోమీటర్ల రోడ్డు, బ్రిడ్జికి ఫారెస్ట్ పర్మిషన్స్ రాలేదు. ఈ పనులు లాస్ట్ ఇయర్ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఫారెస్ట్ పర్మిషన్స్ రాక ఎక్కడికక్కడే నిలిచాయి.
- దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి నుంచి గద్దెలమడుగు వరకు రూ. 1.60కోట్లతో చేపట్టిన 4కిలోమీటర్ల రోడ్డు, కొయ్యూరు – క్రాంతిపురం మధ్య రూ. 2కోట్లతో చేపట్టిన రోడ్డు, బ్రిడ్జీ, గీసరెల్లి నుంచి కిష్టారం మధ్య రోడ్డు, బ్రిడ్జ్ పనులు ఫారెస్ట్ పర్మిషన్స్ ఆలస్యంగా రావడంతో పూర్తి కాలేదు.
- ఆళ్లపల్లి నుంచి మామకన్ను మధ్య కిన్నెరసానిపై రూ. 9 కోట్లతో చేపట్టిన రోడ్డు, బ్రిడ్జి వర్క్స్, ముత్తాపురం నుంచి దొంగతోగు మధ్య రూ. 7కోట్లతో చేపట్టిన రోడ్డు, బ్రిడ్జ్ పనులు ఫారెస్ట్ పనులు సకాలంలో రాకపోవడంతో రెండేండ్ల కిందట నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
- రేగళ్ల టూ మర్కోడ్ మధ్య రూ. 14కోట్లతో చేపట్టిన దాదాపు 12కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు వైల్డ్ లైఫ్ నుంచి ఫర్మిషన్స్ రాక అసంపూర్తిగా మిగిలిపోయాయి.
తప్పని తిప్పలు
వాగులపై కనీసం బ్రిడ్జిలు లేకపోవడంతో గర్బిణులతో పాటు, అనారోగ్యంతో బాధపడ్తున్న వారి అవస్థలు గతంలో ఎన్నోసార్లు కండ్లముందు కనిపించాయి. వరదలు వచ్చిన టైంలో ఎవరైనా మృతి చెందితే కనీసం వాగులు దాటించి దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కోకొల్లలుగా ఉన్నాయి.
ప్రణాళిక లోపం..
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఏజెన్సీలోని పలు గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు పోలీస్‌లు ప్రపోజల్స్ పెడ్తున్నారు. తమ శాఖతో కో ఆర్డినేషన్ చేసుకోకుండానే ప్రపోజల్స్ పెడ్తుండడం వల్ల ఫారెస్ట్ పర్మిషన్స్ రాక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆర్అండ్బీ ఆఫీసర్లు అంటున్నారు. ఇటీవలికాలంలో ఫారెస్ట్ అధికారులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక మీటింగ్ పెట్టారు. పనుల విషయంలో సహకరించాలని సూచించారు. ఫారెస్ట్ పర్మిషన్స్ పేర ఆటంకం కలిగించొద్దని చెప్పిన దాఖలాలున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో సహకరించాలంటూ గతంలో కలెక్టర్లు ఫారెస్ట్ ఆఫీసర్లతో మీటింగ్‌లు పెట్టారు. అయినప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉండడంతో పనుల్లో జాప్యం తప్పడం లేదని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.