కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగొళ్లలో తీవ్ర జాప్యంతో యాసంగి పనులపై ప్రభావం పడుతోందని రైతులు వాపోతున్నారు. సెంటర్లకు తీసుకొచ్చిన వడ్లను కాంట పెట్టడంలోనే కాదు.. కాంట అయినా వడ్లను లిఫ్టింగ్ చేయడంలోనూ డిలే అవుతోంది. ఫలితంగా రైతులు సెంటర్లలోనే వారాల తరబడి ఉంటున్నారు. ఇటీవల బీబీపేట మండలం యాడారంలో ఓ రైతు సెంటర్‌లోనే గుండెపోటుతో చనిపోయారు.
తెచ్చిన 25 రోజులకు...
వానకాలం సీజన్‌లో జిల్లాలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 2.72 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కాంట అయ్యాయి. సెంటర్ల నుంచి మిల్లులకు లక్షా 99 వేల మెట్రిక్ టన్నుల వడ్లు లిఫ్ట్ అయ్యాయి. రైతులు తీసుకొచ్చిన వడ్లు కాంట పెట్టడానికి 15 నుంచి 25 రోజుల వరకు పడుతోంది. కోతలు షూరు అయిన నెల తర్వాత కొనుగోళ్లను షూరు చేశారు. దీనికి తోడూ వడ్ల లిఫ్టింగ్‌లో బాగా డిలే అవుతోంది. ఈ పరిస్థితుల్లో కాంటలపై ప్రభావం పడుతోంది. కాంట కంప్లీట్ అయిన తర్వాత 3 నుంచి 7 రోజుల వరకు కూడా సెంటర్ నుంచి వడ్లు రైస్ మిల్లుకు తరలించడం లేదు. లారీల కొరత, మిల్లుల వద్ద ఆన్లోడింగ్లో జాప్యం జరుగుతోంది. చాలా సెంటర్ మాయిశ్చర్ వచ్చిన తర్వాత వారం రోజులకు కాంట పెడుతున్నారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, రాజంపేట తదితర మండలాల్లోని సెంటర్లలో కాంట అయిన తర్వాత వేలాది బస్తాలు రోడ్లపైనే ఉన్నాయి. పలు చోట్ల మూడు, నాలుగు రోజుల వరకు లారీలు రావడం లేదు. కాంట కంప్లీట్ అయిన కూడా వాటిని లిఫ్ట్ చేసే వరకు రైతులదే బాధ్యత అని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అక్కడే వాటి దగ్గరే రాత్రింబవళ్లు ఉండాల్సి వస్తోంది. కాంట కానీ రైతులతో పాటు కాంట కంప్లీట్ అయిన రైతులు కూడా రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు.
యాసంగి పనులపై ప్రభావం
ప్రస్తుతం యాసంగి సీజన్ షూరు అయ్యింది. ఆరు తడి పంటలతో పాటు వరి పంటను సాగు చేసేందుకు రైతులు రెడీ అవుతున్నారు. వడ్ల కాంట కోసం సెంటర్లలోనే రైతులు ఉంటుండడంతో యాసంగికి సంబంధించిన పనులకు ఇబ్బంది అవుతుందని చెబుతు న్నారు. దుక్కి దున్నడం, నారు పోయడం తదితర పనులకు ఆలస్యం అవుతుందని తెలిపారు. కాంటలతో పాటు, లిఫ్టింగ్ స్పీడప్ చేయాలని కోరుతున్నారు. నాలుగు రోజుల కింద బీబీపేట మండలం యాడారంలో రావర్తి నర్సయ్య ( 68) రైతు వడ్ల కొనుగోలు సెంటర్‌లో గుండెపోటుతో చనిపోయారు. గత సీజన్లలో కూడా జిల్లాలో రైతులు చనిపోయిన ఘటనలు
ఉన్నాయి.
ఫొటోలో ఉన్న రైతు రాజంపేట మండల కేంద్రానికి చెందిన కొలిమి శంకర్. ఆయన మూడు ఎకరాల్లో పండించిన వడ్లను మూడు వారాల కింద వడ్లను సెంటర్‌కు తీసుకొచ్చాడు. గురువారం కాంట పెట్టారు. కాంటా పెట్టిన వడ్లను లారీల్లో రైసు మిల్లుకు తరలించే వరకు ఇక్కడే ఉండాలని చెప్పారు. వడ్లు ఎప్పుడు లిప్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. తనకు ఇంటి వద్ద రెండు బర్లు ఉన్నాయని, సెంటర్ వద్దనే వడ్లకు కాపల ఉండడంతో గడ్డి వేయలేక పోతున్నానని తెలిపారు. ఇప్పటి వరకు యాసంగి వరి నారు కూడా ఇంకా పోయలేదని వాపోయాడు.
స్పీడప్ చేస్తాం..
సెంటర్‌లో కాంట కాగానే లిఫ్టింగ్‌కు చర్యలు తీసుకుంటున్నాం. ట్రాన్స్‌ఫోర్టు ప్రాబ్లమ్ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే క్లియర్ చేస్తున్నాం.
- జితేంద్రప్రసాద్, డీఎం, సివిల్ సప్లయ్