సూర్యాపేట/వర్ధన్నపేట, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి నెల దాటుతున్నా కొనడం లేదని, తేమ పేరుతో మద్దతు ధరలో కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏనుబాముల గ్రామం వద్ద సూర్యాపేట– -దంతాలపల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. అధికారులు, ఐకేపీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తాము కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో సగం పంట నష్టపోయామని, మిగిలిన సగం అమ్ముకుందామంటే అధికారుల తీరుతో వీలు కావడం లేదన్నారు.
వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలతో ధాన్యంలో తేమ శాతం తగ్గడంలేదని, దీంతో రోజు ధాన్యాన్ని తిరగ్గొట్టేందుకు చెమటోడ్చాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మం డలం ఇల్లందలోని వరంగల్-–ఖమ్మం జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇల్లంద మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మూడు రోజులవుతున్నా కొనుగోళ్లు మొదలుపెట్టలేదన్నారు.
బస్తాకు ఐదు కిలోలు కట్ చేస్తున్నరని..
కొడిమ్యాల/స్టేషన్ ఘన్పూర్: వడ్లు మొలకెత్తాయనే సాకుతో బస్తాకు ఐదు కిలోలు కట్ చేస్తున్నారని కొడిమ్యాల మండలం పూడూర్ హైవేపై రైతులు రాస్తారోకో చేశారు. దమ్మయ్యపేట కొనుగోలు సెంటర్‌లో 40 కిలోల బస్తాకు ఒకటిన్నర కిలో చొప్పున కటింగ్ పెట్టి కాంటా వేశారని, మిల్లుకు వెళ్లాక ప్యాక్స్ సిబ్బంది, మిల్లర్లు కుమ్మక్కై వడ్లకు మొలకలు వచ్చాయని బస్తాకు 5 కిలోలు కటింగ్ పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై మిల్లర్లను ప్రశ్నించగా కటింగ్ చేస్తామని చెప్పలేదని, మొలకెత్తిన వడ్లను కొనేది లేదని చెప్పామని స్పష్టం చేశారు. రైతుల ధర్నాతో గంట పాటు హైవేపై ట్రాఫిక్ జామయ్యింది. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు.
మరోవైపు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో మిల్లర్లు 40 కిలోల వడ్ల బస్తాకు 4 కిలోల తరుగు తీస్తున్నారని బస్టాండ్ దగ్గర నేషనల్ హైవే పై రైతులు రాస్తారోకో చేశారు. వడ్లను రోడ్డుపై పోసి కాలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ వారం కింద వడ్లను అమ్మేందుకు స్థానిక ఆర్టీసీ గ్రౌండ్ లో కుప్పలు పోశామన్నారు. తేమ శాతం 17 లోపు ఉండే విధంగా, తాలు లేకుండా చేసి అమ్మాలని చూస్తే స్థానిక అన్నపూర్ణ రైస్ మిల్లు ఓనర్ 40 కిలోల బస్తాకు తరుగు కింద 2 కిలోలు అదనంగా కలిపి తూకం వేస్తేనే దిగుమతి చేసుకుంటామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే లారీలు పంపేదిలేదని కొర్రీలు పెడుతున్నాడన్నారు. మిల్లు ఓనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో రెండువైపులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ఎస్సై శ్రావణ్ కుమార్ వచ్చి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపచేశారు.