సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఉత్సవ కమిటీ ఏర్పాటు పై జాప్యం జరుగుతోంది. స్వామివారి కల్యాణంలో పాటు సంక్రాంతి తరువాత మూడు నెలల జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో మల్లన్న ఉత్సవ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే చర్చ మొదలైంది. గత సెప్టెంబర్ లో మల్లికార్జున స్వామి ఆలయ పాలక మండలి గడువు ముగిసింది. తర్వాత రెగ్యులర్ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెండింగ్ లో పడింది.
తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రెగ్యులర్ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం రెగ్యులర్ కమిటీ కోసం 45 రోజుల ముందు నోటీఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్లు స్వీకరిస్తారు. వీటిని స్క్రూటినీ చేసి చైర్మన్ తో సహా పాలక మండలి సభ్యులను ఎంపిక చేస్తారు. కానీ ప్రస్తుతం అంత సమయం లేకపోవడంతో 15 మంది సభ్యులతో మూడు నెలల కోసం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసే పరిస్థితి నెలకొంది.
ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి పాలక మండలిలో చోటు కోసం స్థానిక కాంగ్రెస్ నేతలుప్రయత్నాలు ప్రారంభించారు. పది సంవత్సరాలుగా ప్రతి పక్షానికే పరిమితం కావడంతో కాంగ్రెస్ నేతలకు పాలక మండలిలో చోటు లభించలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆశావహులు తమదైన రీతిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 75 మంది రెగ్యులర్, ఉత్సవ కమిటీల్లో స్థానం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఉత్సవ కమిటీలో చోటు దక్కకుంటే రెగ్యులర్ కమిటీలోనైనా చోటు దక్కించుకునే లా ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల జాతర జరిగే సమయంలో దాదాపు 10 లక్షల మంది భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో కనీసం తాత్కాలిక కమిటీలోనైనా చోటు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.
మంత్రి మద్దతు కోసం ప్రయత్నాలు
కొమురవెల్లి పాలకవర్గంలో స్థానం కోసం పలువురు నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులకే అవకాశం కల్పించాలని కోరుతూ తమ పేర్లను పరిశీలించాలనే ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. పొన్నం ప్రభాకర్ సన్నిహితులు సైతం కొమురవెల్లి పాలక వర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
రెగ్యులర్ కమిటీ లో స్థానం కోసం కొమురవెల్లి మండలం నుంచి మహాదేవుడి శ్రీనివాస్ , లింగంపల్లి శ్రీనివాస్, కనకరాజు, చేర్యాల మండలం నుంచి పర్పటకం లక్ష్మారెడ్డి, కొమ్ము నర్సింగరావు, మద్దూరు మండలం నుంచి కామిడి రమేశ్ రెడ్డి , బొడిగె నర్సింలు, రమణారెడ్డి, రవి, జీవన్ రెడ్డి, యాదగిరిలతో పాటు జనగామ, మద్దూరు, నర్మెట మండలాలకు చెందిన పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య చిచ్చు
కొమురవెల్లి జాతర ఏర్పాట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య చిచ్చు రేపుతున్నాయి. కొమురవెల్లి మండలం జనగామ నియోజకవర్గం పరిధిలోకి వస్తుండగా ఇటీవలి బీఆర్ఎస్ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి చెందిన కొమ్మూరి ప్రతాప రెడ్డి మధ్య వివాదానికి కారణమౌతోంది. ఇటీవల సిద్దిపేటలో మంత్రి కొండ సురేఖ నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో మంత్రితో పల్లా వాదన పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో జాతర ఏర్పాట్ల విషయంలో అధికార కాంగ్రెస్ నేతల జోక్యంతో ఇరు పార్టీల మధ్య వివాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మూడు నెలల పాటు జాతర
కోట్లాది మంది కొలిచే కొమురవెల్లి మల్లన్న జాతర మూడు నెలల పాటు కొనసాగుతుంది. జనవరి7న మల్లికార్జున స్వామి కల్యాణోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమై మార్చి 8తో ముగుస్తాయి. జనవరి 21న పట్నంవారంతో జాతరకు అంకురార్పణ జరిగితే జనవరి 28న లస్కర్ వారం నిర్వహణ, మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా పెద్ద పట్నంతో పాటు అగ్ని గుండాల కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. మూడు నెలల జాతర సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్నుంచి లక్షాలాది మంది భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వస్తారు.