వైద్యో నారాయణో హరి అంటారు.. డాక్టర్లను కనిపించే దేవుళ్లని అంటుంటారు, కులమతాలకు అతీతంగా డాక్టర్లను చేతులెత్తి ముక్కుతాం. అలాంటి డాక్టర్లే తెల్లకోటు ధరించి యమపాశంలా స్టెతస్కోప్ పట్టిన యముళ్ళలా తయారవుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన దారుణం చూస్తే ఇదే అనిపిస్తుంది. హైదరాబాద్ లోని పారమిత హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి బలయ్యింది. అడ్మిషన్ తీసుకోలేదని అరగంట ఆలస్యం చేయటంతో శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న చిన్నారి మరణించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ పానగల్ కు చెందిన 5 సంవత్సరాల చిన్నారి అదిరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని అత్యవసర స్థితిలో హాస్పిటల్ కు తీసుకురాగా.. చికిత్స అందించకుండా అడ్మిషన్ తీసుకోవాలని అడ్మిషన్ పేరుతో అరగంట ఆలస్యం చేయడం వల్ల తమ చిన్నారి మృతి చెందినాట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్తపేటలోని పారమిత హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన చేపట్టగా.. హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
చిన్నారిని మొదట నల్గొండ టౌన్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా కండిషన్ అంతమంచిగా లేదని హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ కు తీసుకువెళ్ళమని చెప్పారు అక్కడి డాక్టర్లు. రాత్రి 12గంటల సమయంలో పారమిత హాస్పిటల్ తీసుకురాగా సుమారు 45 నిమిషాల వరకు ట్రీట్మెంట్ చేయకుండా అడ్మిషన్,అమౌంట్ కట్టించు కోవడానికి ఆలస్యం చేశారు సిబ్బంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.