తునికాకు టెండర్లు పిలిచేదెప్పుడో?

తునికాకు టెండర్లు పిలిచేదెప్పుడో?
  • డిసెంబర్ల్​లోనే కంప్లీట్​ కావాలే.. ఇప్పటికీ ప్రారంభం కాని ప్రక్రియ
  • ఆలస్యంతో సేకరణకు ఆటంకం.. ఆదివాసీల ఆదాయానికి గండి
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20 వేల కుటుంబాలకు ఉపాధి 
  • ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్​లో టెండర్ల ప్రక్రియ పూర్తి 
  • ప్రభుత్వం త్వరగా టెండర్లు పిలవాలని గిరిజనుల విజ్ఞప్తి

భద్రాచలం, వెలుగు :  తునికాకు సేకరణ ఆదివాసీలకు ప్రధాన ఆదాయ వనరు. దీనిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి. ఏటా వేసవి పంటగా అడవుల్లో ఈ ఆకును సేకరించడం వల్ల వారి కుటుంబ పోషణకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అటువంటి తునికాకు సేకరణకు సంబంధించిన టెండర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతేడాది తరహాలోనే ఈసారి టెండర్లను పిలవడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీనివల్ల తునికాకు కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. 

ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్​లో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో గత సంవత్సరం కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే టెండర్లు పిలిచారు. టెండర్లు ఓకే అయి, కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకునే సరికి మరింత కాలం గడిచిపోయింది. దాంతో ఆకుసేకరణ లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు. వాస్తవానికి ఈ తతంగం అంతా డిసెంబర్​లోనే పూర్తి చేసుకోవాలి. 

గతేడాది 41.7 శాతం మాత్రమే సేకరణ 

గత సంవత్సరం టెండర్లను పిలవడంలో ఆలస్యం కావడం వల్ల ఫ్రూనింగ్, కల్లాల ఎంపిక అంతా మందకొడిగా సాగింది. జిల్లాలోని ఆరు డివిజన్లలో 39 యూనిట్ల ద్వారా 33,300 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ సకాలంలో తునికాకు సేకరణ జరగలేదు. కేవలం 13,478 స్టాండర్డ్ బ్యాగులు మాత్రమే తునికాకు వచ్చింది. అంటే 41.7 శాతం మాత్రమే సేకరించగలిగారు. టార్గెట్​ చేరుకోలేక అటవీశాఖ చతికిలపడింది. ఆదివాసీల ఆదాయానికి గండిపెట్టారు. ఏప్రిల్, మే నెలలలో సేకరణ జరగాలంటే ఇప్పటికే టెండర్లు పూర్తి కావాలి. 

ఆన్​లైన్​ టెండర్లు పిలుస్తరు

తునికాకు సేకరణ కోసం ఆన్​లైన్​ ద్వారా టెండర్లు పిలుస్తరు. పదిహేను రోజుల కింద మీటింగ్ ​జరిగింది. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరూ ఆందోళన చెందవద్దు. కృష్ణగౌడ్, డీఎఫ్​వో, భద్రాద్రికొత్తగూడెం

ఆదివాసీల కడుపుకొట్టొద్దు

ఆదివాసీ గూడేల్లో ఉండే గిరిజనులకు సీజన్ల వారీగా ఆదాయ వనరులు ఉంటాయి. వ్యవసాయ కూలీ పనులు ముగిసి వేసవిలో పనుల కోసం ఆదివాసీలు తండ్లాడుతారు. ఇందులో తునికాకు సేకరణ వారి జీవనవిధానంలో ఒక భాగం. కుటుంబం మొత్తానికి ఇదే ఆధారం. టెండర్లు ప్రతీ సంవత్సరం ఆలస్యమవుతున్నాయి. దీంతో వేసవిలో వచ్చే అకాల వర్షాలు, గాలి వల్ల తునికాకు పాడై పోతుంది.

ఫ్రూనింగ్​ ఆలస్యమైనా ఆకు త్వరగా రాదు. గిరిజనుల పొట్టగొట్టకుండా త్వరగా టెండర్లు పిలవాలి. ఇదే విషయమై ఇటీవల హైదరాబాద్​లో వినతిపత్రం కూడా ఇచ్చాం. - కారం పుల్లయ్య, గిరిజన సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి