
- ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకుల తీరు
- వెంటాడుతున్న వడగండ్ల వానల భయం
- సెంటర్ల పై మిల్లర్ల ఒత్తిళ్లు
- ఓపీఎంఎస్ ఎంట్రీల్లో ఆజమాయిషీ
జనగామ, వెలుగు : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, కాంటాలు మాత్రం కదలడం లేదు. మద్దతు ధర ఆశించి సెంటర్లకు వడ్లు తీసకువస్తున్న రైతులకు ప్రస్తుతం వడగండ్ల వానలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వడ్లు ఎండబోయడం, వానలకు తడుస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంకా పలు చోట్ల కాంటాలు పెట్టకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
ఊపందుకుంటున్న కోతలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి కోతలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల అకాల వానలతో కాస్త లేట్ అవుతున్నప్పటికీ కోతలు జోరుగా సాగుతున్నాయి. జనగామ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 3 లక్షల 75 వేల 453 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్ల అంచనా. ఇందులో 2లక్షల 35 వేల 954 మెట్రిక్ టన్నుల ధాన్యం సర్కారు సెంటర్ల ద్వారా సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. సన్నాలు 62,013, దొడ్డు వడ్లు 1 లక్షా 73,941 మెట్రిక్ టన్నులు సేకరించాలని కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ క్రమంలో 20 రోజుల నుంచి సెంటర్లను ప్రారంభిస్తూ వస్తున్నారు. జిల్లాలో 300ల సెంటర్లకు 276 ఓపెన్ చేయగా, ఇప్పటి వరకు 157 సెంటర్లలో కాంటాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల త్వరితగతిన స్టార్ట్ చేయాలని కలెక్టర్లు యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు.
తప్పని ఎదురు చూపులు..
తేమ కారణంతో కాంటాలు చేపట్టేందుకు సెంటర్ల నిర్వాహకులు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు జనగామ జిల్లాలో 157 సెంటర్లలో 3914 మంది రైతుల వద్ద 20860.200 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. వీటిలో 1665.480 మెట్రిక్ టన్నులు సన్న వడ్లు కాగా, 19194.720 దొడ్డు రకం వడ్లు ఉన్నాయి. 3546 మంది రైతులకు చెందిన 19065.200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 368 మంది రైతులకు చెందిన 1795 మెట్రిక్ టన్నులు తరలించాల్సి ఉంది.
కాగా, 77 సెంటర్లలో 2284 మంది రైతులకు చెందిన 11324.040 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఓపీఎంఎస్ ట్యాబ్లో ఎంట్రీ చేశారు. మిగిలిన 1630 మంది రైతులకు చెందిన 9536.160 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉంది. హనుమకొండ జిల్లాలో 131 సెంటర్లు ఓపెన్ కాగా, 51 సెంటర్లలో, ములుగు జిల్లాలో 138 సెంటర్లు ఓపెన్ కాగా, 24 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు స్టార్ట్ అయ్యాయి. మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో ధాన్యం ఇప్పుడిప్పుడే సెంటర్లకు వస్తున్నట్లు నిర్వాహకులు
చెబుతున్నారు.
మిల్లర్ల ఒత్తిళ్లు..
ధాన్యం కొనుగోళ్ల వివరాలు ట్యాబ్లో ఎంట్రీలు త్వరగా చేస్తేనే పేమెంట్లు వెంటనే జమవుతాయి. సెంటర్ నిర్వాహకులపై మిల్లర్ల ఒత్తిడి షరామామూలుగా మారింది. సెంటర్లలో కాంటాలు జరిగి లారీ లోడ్ అయి మిల్లుకు బయలుదేరేలోపు ధాన్యం వివరాలు ఓపీఎంఎస్ ట్యాబ్ఎంట్రీలు పూర్తి చేయాలని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అయితే తరుగు వస్తుందని, బస్తాకు 41 కిలోలకు పైగా కాంటాలు వేయాలని, లేదంటే మిల్లులో అన్లోడ్ చేసుకున్నాకనే ట్యాబ్ఎంట్రీలు చేయాలంటూ మిల్లర్లు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు. మిల్లర్ల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతీ రెండు మూడు సెంటర్లకు ఒక జూనియర్ అసిస్టెంట్స్థాయి ఉద్యోగిని ఇన్చార్జిగా పెట్టినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు.
కొనుగోళ్లు స్పీడప్ చేస్తున్నం..
జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్ల ప్రారంభం దాదాపుగా పూర్తయ్యింది. కాంటాలను కూడా వెంటనే జరపాలని నిర్వాహకులకు ఆదేశాలిచ్చాం. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్రోహిత్ సింగ్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
వీ.హథీరామ్, సివిల్ సప్లై డీఎం, జనగామ