మూడేండ్లయినా ముందరపడని హెల్త్​ సబ్​ సెంటర్లు!

మూడేండ్లయినా ముందరపడని హెల్త్​ సబ్​ సెంటర్లు!
  • యాదాద్రి జిల్లాకు 80 సెంటర్లు మంజూరు 
  • నిధులు సరిపోక పనులు మధ్యలో ఆపిన కాంట్రాక్టర్లు
  • చేసిన పనులకు బిల్లులు సరిగా వస్తలే
  • కొన్నింటి పనులు స్టార్ట్ కాలే

యాదాద్రి, వెలుగు : 'ఆయుష్మాన్​ ఆరోగ్య మందిర్​' పేరుతో మంజూరైన హెల్త్​సబ్​సెంటర్లు మూడేండ్లయినా ఏడియాడనే ఉన్నాయి. మంజూరైన వాటిలో కొన్ని మాత్రమే పూర్తి కాగా.. మిగిలినవన్నీ వివిధ స్టేజీల్లో ఉన్నాయి.  అప్పటి బీఆర్ఎస్​ గవర్నమెంట్​ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరును పల్లె దవాఖానగా మార్చడంతో కేంద్రం ఫండ్స్​విషయంలో నిరాసక్తత కనబర్చింది. పైగా నిర్మాణాల కోసం కేటాయించిన మొత్తం సరిపోదనే కారణంతో కొందరు కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపేశారు. కొన్నింటి పనులు అసలు స్టార్టే చేయలేదు.

సౌలతులు కూడా కల్పించలేదు..

యాదాద్రి జిల్లాలో 142 హెల్త్​ సబ్​సెంటర్లు ఉన్నాయి. వీటిలో రూరల్​ఏరియాల్లోని చాలా హెల్త్​సబ్​సెంటర్లకు సొంత బిల్డింగ్​లు సరిగా లేవు. సౌలత్​లు కూడా సరిగా కల్పించలేకపోయారు. దీంతో నేషనల్​హెల్త్​మిషన్​(ఎన్​హెచ్​ఎం) 55 హెల్త్​ సెంటర్లకు, 15వ ఆర్థిక సంఘం మరో 25 హెల్త్​ సెంటర్లకు సొంత బిల్డింగ్​లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది. 'ఆయుష్మాన్​ ఆరోగ్య మందిర్'​ పేరుతో 2022–-23లో 80 బిల్డింగ్​లు మంజూరు చేసింది.

 ఇందులో ఆలేరు నియోజకవర్గంలో 37, భువనగిరి నియోజకవర్గంలో 25, మునుగోడు నియోజకవర్గంలో 8, తుంగతుర్తి నియోజకవర్గంలో 6, నకిరేకల్‌ నియోజకవర్గంలో 4 సబ్​సెంటర్లకు సొంత బిల్డింగ్​లు మంజూరు చేశాయి. వీటిలో ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ డిపార్ట్​మెంట్లకు బిల్డింగ్​నిర్మాణ పనులను అప్పగించారు. ఒక్కో బిల్డింగ్​కు రూ.20 లక్షల చొప్పున రూ.16 కోట్లు మంజూరు చేశారు.  

పనులు ఏడియాడనే..

హెల్త్​ సబ్​సెంటర్లకు బిల్డింగ్​లు మంజూరైన తర్వాత అప్పటి బీఆర్ఎస్ సర్కారు.. ఆయుష్మాన్​ఆరోగ్య మందిర్​పేరును పల్లె దవాఖానగా మార్చింది. సొంత బ్రాండ్​గా ప్రచారం చేసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్​రిలీజ్​విషయంలో నిరాసక్తత కనబర్చింది. మూడేండ్లు గడిచినా ఇప్పటివరకు వాటి పనులు పూర్తి కాలేదు. 

రెండు సెంటర్లకు స్థల కేటాయింపుల్లో వివాదం నెలకొనగా, కొన్నింటికి పలుమార్లు టెండర్లు పిలిచినా  కాంట్రాక్టర్లు రాలేదు. మొత్తంగా పది సెంటర్ల పనులు కూడా ప్రారంభంకాలేదు. పనులు ప్రారంభించిన సెంటర్లలో కొన్ని పలు స్టేజీల్లో ఉన్నాయి. కొన్ని స్లాబ్​పనులు పూర్తి కాగా.. ప్లోరింగ్​పనులు, వాటర్, కరెంట్​వంటివి ఏర్పాటు చేయలేదు. 

కాంట్రాక్టర్ల నిరాసక్తత..

హెల్త్​సబ్​సెంటర్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు కూడా వాటిని పూర్తి చేయడంపై నిరాసక్తత కనబరుస్తున్నారు. ఒక్కో బిల్డింగ్​ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయడం, వాటిలోనూ 20 శాతం అమౌంట్​ పన్నుల రూపంలో కట్​ అవుతుంది. మిగిలిన 80 శాతం అమౌంట్​తోనే బిల్డింగ్​లు పూర్తి చేయాలి. ఇందులోనూ ఆఫీసర్లు కొంత 'ఆశిస్తు'న్నారు. చేసిన పనులకు బిల్లులు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిణామాలతో పనులు చేయడంపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. 

అయితే బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు రేట్లు పెరుగుతున్నందున నిర్ణయించిన అంచనా వ్యయం రూ.20 లక్షలు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ కారణంగానే 15వ ఆర్థిక సంఘం నిధులు రెడీగా ఉన్నా.. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. అంచనా వ్యయం పెంచడంతోపాటు బిల్లులు వెంటవెంటనే రిలీజ్ చేసినట్లయితే పనులు త్వరగా పూర్తవుతాయని కాంట్రాక్టర్లు అంటున్నారు.