ములుగు జిల్లా తొలగింపు అనేది దుష్ర్పచారం : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ఏండ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న ములుగు జిల్లాను తొలగిస్తారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పార్లమెంట్​ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో జిల్లాను అభివృద్ధి చేసుకుందామని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. మూడేండ్లుగా అన్నివర్గాల ప్రజలతో కలిసి పోరాటం చేస్తే  వచ్చిన జిల్లాను తొలగిస్తారని కొందరు కావాలనే బురద చల్లుతున్నారన్నారు. 

మంగళవారం ములుగు క్యాంపు ఆఫీసులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.  మల్లంపల్లి మండలాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామన్నారు. మల్లంపల్లి మండలం, ఏటూరునాగారం డివిజన్​పై గత పాలకులు ఎలాంటి జీవో, గెజిట్ ఇవ్వలేదని, భవిష్యత్తులో తాము ఏర్పాటు చేసి అభివృద్ధికి  కృషి చేస్తామన్నారు.