ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో అక్టోబర్ 28న బెలూన్‌లను నింపడానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలిపోయి 50 ఏళ్ల బెలూన్ విక్రేత మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. సంగం విహార్‌లోని జి బ్లాక్‌లో సాయంత్రం 4.30 గంటలకు దీప్ సింగ్ అనే బెలూన్ విక్రేత నివాసం వెలుపల ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు.
సింగ్ గ్యాస్ సిలిండర్‌లో కాల్షియం కార్బైడ్, నీటిని వేస్తుండగా అది పగిలిపోవడంతో అతనికి గాయాలు అయ్యాయని, సమీపంలో నిలబడి ఉన్న కార్మికుడు హనీఫ్ అన్సారీ (35), 6 ఏళ్ల బాలిక గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. వారందరినీ ఆసుపత్రికి తరలించగా, సింగ్ మృతి చెందినట్లు ప్రకటించారు. హనీఫ్ కోలుకుంటున్నాడని, బాలికను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి తెలిపారు.