ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)  బుధవారం 400 మార్కును అధిగమించి "అతి తీవ్రమైన" కేటగిరీలోకి చేరింది. ఢిల్లీతోపాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 10 విమానాలను దారి  మళ్లించారు. వీటిలో ఆరు జైపూర్, ఒక లక్నో విమానం ఉంది. 

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8.30 గంటలకు జీరో-మీటర్ విజిబిలిటీ నమోదైంది. ఢిల్లీలో రెండు వారాల పాటు 'వెరీ పూర్' కేటగిరీలో కొనసాగిన ఏక్యూఐ.. బుధవారం ఒక్కసారిగా 'అతి తీవ్రమైన' కేటగిరీలోకి ప్రవేశించడంతో విజిబిలిటీ తగ్గింది. కాలుష్యం కారణంగా దట్టమైన పొగ కమ్మేయటంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో నీటిని జల్లులుగా చిలకరించడంతోపాటు నిర్మాణ, కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశాలలో ధూళి నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇండో-గంగా మైదానాల్లోనూ గాలి నాణ్యత ఆందోళనకరంగా ఉందని తెలిపారు. బీహార్​లో మూడు, హర్యానాలోని రెండు సిటీలు, చండీగఢ్ ప్రాంతాలను దేశంలోని టాప్ 10 కాలుష్య ప్రదేశాలుగా గుర్తించారు.