ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 మూసివేత.. విమానాలు రద్దు

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 మూసివేత.. విమానాలు రద్దు

ఢిల్లీ విమానాశ్రమంలోని టెర్మినల్ ఒకటి రూఫ్ కుప్పకూలిన ఘటనతో.. ఎయిర్ పోర్ట్ అధారిటీ స్పందించింది. టెర్మినల్ ఒకటి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. టెర్మినల్ వన్ నుంచి విమాన రాకపోకలను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టెర్మినల్ ఒకటి మూసివేస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది. 

ప్రమాదం జరిగిన తర్వాత..  కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన నాయుడు ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు.. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు. 

టెర్మినల్ వన్ రూఫ్ మొత్తాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని టెర్మినల్ వన్ మొత్తాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి రామ్మోహననాయుడు. టెర్మినల్ 2, టెర్మినల్ 3 పూర్తి స్థాయిలో పని చేస్తాయని వెల్లడించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని.. దీంతో కొన్ని విమాన సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి.. ఆయా ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వటం జరిగిందన్నారు. 

టెర్మినల్ ఒకటి నుంచి రాకపోకలు సాగించే విమానాలు అన్నింటినీ టెర్మినల్ 2, 3 నుంచి ఆపరేట్ చేయటం జరుగుతుందని.. పూర్తిగా పరిశీలించిన.. ఎలాంటి ప్రమాదం లేదు అన్న తర్వాత టెర్మినల్ ఒకటిని ఓపెన్ చేస్తామని వెల్లడించారాయన.