ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (ఢిల్లీ ఎయిర్ పోర్టు) మరోసారి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టు టాప్ లో మరో మారు నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేసిన సర్వేలో 2023లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ టెన్ ఎయిర్ పోర్టుల్లో ఒకటిగా ఢిల్లీ ఎయిర్ పోర్టు ఉన్నట్టు ప్రకటించింది.
ఢిల్లీ విమానాశ్రయంలో 2023 సంవత్సరంలో దాదాపు 7 కోట్ల 22 లక్షల14 వేల 841 మంది ప్రయాణీకులు ప్రయాణించినట్టు తెలిపింది. 2022లో ఢిల్లీ ఎయిర్ పోర్టు 9వ స్థానంలో ఉండగా 2023లో టాప్ 10లో పదవ స్థానాన్ని కైవాసం చేసుకున్నట్టు సంస్థ ప్రకటించింది. యూఎస్‌లోని అట్లాంటా విమానాశ్రయం గత ఏడాది 10 కోట్ల 46 లక్షల 53 వేల 451 మంది ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా ప్రపంచంలోనే మొదటి స్థానానికి ఎక్కింది.
ఇక రెండవ ప్లేస్ లో దుబాయ్ విమానాశ్రయం వచ్చి చేరింది. 2023లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 8 కోట్ల 69 లక్షల 94 వేల 365 మంది ప్రయాణికులు ప్రయాణించారు. "అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రయాణీకుల ప్రవాహం పై టాప్ 10 రద్దీగా ఉండే విమానాశ్రయాల డేటాను విడుదల చేశామని సంస్థ తెలిపింది. టాప్ 10 ర్యాంకింగ్ లోని విమానాశ్రయాల్లో 5 విమానాశ్రయాలు యూఎస్ లోనే ఉన్నాయని సంస్థ తెలిపింది.