న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు అధికారులతో కమిషన్ సభ్యులు భేటీ కానున్నారు. ఈ మీటింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారని విశ్వసయనీయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లుండగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి పోటీ చేయనుండగా, సీఎం ఆతిశీ కల్కాజీ నుంచి బరిలోకి దిగనున్నారు. కేజ్రీవాల్ పై ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేయనున్నారు. డిసెంబర్ చివరివారంలో తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేయనుందని బీజేపీ నేతలు తెలిపారు. కొత్త వారినే ఎక్కువగా బరిలోకే దింపే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.