ఢిల్లీ ఎన్నికల్లో ఉచితాల జోరు..ఎకానమీపై ఎఫెక్ట్..ఆర్థికవేత్తల ఆందోళన

ఢిల్లీ ఎన్నికల్లో ఉచితాల జోరు..ఎకానమీపై ఎఫెక్ట్..ఆర్థికవేత్తల ఆందోళన

అన్ని పార్టీలదీ అదే బాట..నగదు బదిలీ, పథకాలతో ఓటర్లకు వల
పోటాపోటీగా హామీలు ఇస్తున్న బీజేపీ, ఆప్, కాంగ్రెస్
ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తల ఆందోళన  

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన పార్టీలన్నీ ప్రజలపై హామీల వర్షం కురిపించాయి. పోటాపోటీగా నగదు బదిలీ, ఉచిత పథకాలను ప్రకటించాయి. రాష్ట్ర బడ్జెట్, హామీల అమలుకు కావాల్సిన నిధుల గురించి ఆలోచన లేకుండా.. కేవలం ఓట్లను దండుకోవడమే పనిగా క్యాష్, ఫ్రీ స్కీమ్స్ తో మేనిఫెస్టోలను విడుదల చేశాయి. 

మహిళలు, పూజారులు, గురుద్వారాల్లోని గ్రాంథీల కోసం నగదు బదిలీ పథకాలను ప్రకటించాయి. నిరుద్యోగులకు భృతి, స్టూడెంట్లకు స్టైపెండ్, సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం లాంటి హామీలు ఇచ్చాయి. ఇక ఫ్రీ బస్ జర్నీ, పండుగలకు ఫ్రీ ఎల్పీజీ సిలిండర్లు, ఫ్రీ కరెంట్, సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీ ట్రీట్ మెంట్ లాంటి ఉచిత పథకాలను ప్రకటించాయి. 

అయితే, ప్రజలకు అవసరమైన సౌలతులు కల్పించడం కంటే.. వాళ్లకు నేరుగా నగదు బదిలీ చేయడం, ఉచితంగా అందించడంపైనే పార్టీలు దృష్టి పెట్టాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, ఎకానమీకి ఎంతమాత్రం మంచిదికాదని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఉచితాలు, నగదు బదిలీ పథకాల పేరుతో జరుగుతున్న వ్యవహారం.. రాజకీయ పార్టీలు, ఓటర్ల మధ్య క్విడ్ ప్రో కో లాంటిదేనని అభిప్రాయపడుతున్నారు. ‘‘ఢిల్లీ బడ్జెట్ రూ.78 వేల కోట్లు. ఈ బడ్జెట్ తో ఇంతటి హామీల అమలు సాధ్యమా?” అని ప్రశ్నిస్తున్నారు.  

ప్రధాన పార్టీల హామీలు ఇవీ..    

ఆప్ 

మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం. 
    ఆలయ పూజారులు, గురుద్వారాల్లోని గ్రాంథీలకు నెలకు రూ.18 వేలు. 
    ఆటో డ్రైవర్ల బిడ్డల లగ్గాలకు రూ.లక్ష ఆర్థిక సాయం. ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల లైఫ్ ఇన్సురెన్స్, రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. యూనిఫామ్ కోసం ఏటా రూ.2,500. 
    ఢిల్లీ వాసులతో పాటు కిరాయిదారులకూ నెలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. 
    సీనియర్ సిటిజన్స్ కు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ ట్రీట్ మెంట్. 
    స్కూల్, కాలేజీ విద్యార్థులందరికీ ఫ్రీ బస్. మెట్రోలో 50% డిస్కౌంట్. 
    విదేశాల్లో ఉన్నత విద్య చదివే దళిత విద్యార్థులకు ఫీజులన్నీ చెల్లింపు. 

బీజేపీ 

    మహిళలకు నెలకు రూ.2,500 చెల్లింపు. గర్భిణులకు రూ.21 వేలు ఆర్థిక సాయం. 
    సివిల్స్ అభ్యర్థులకు రూ.15 వేలు, టెక్నికల్ కోర్సులు చదివే ఎస్సీ స్టూడెంట్లకు రూ.వెయ్యి స్టైపెండ్. 
    ఎల్పీజీ సిలిండర్లపై రూ.500 సబ్సిడీ. ఏటా రెండు ఫ్రీ సిలిండర్లు. 
    వృద్ధులకు రూ.2,500 పింఛన్. 70 ఏండ్లు దాటినోళ్లకు రూ.3 వేలు. 
    200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు ఫ్రీ బస్. 
    ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, రూ.5 లక్షల యాక్సిడెంట్ ఇన్సురెన్స్. 
    సీనియర్ సిటిజన్స్ కు రూ.10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్ మెంట్. 

కాంగ్రెస్ 

  •     పేద మహిళలకు నెలకు రూ.2,500. 
  •     ఢిల్లీ వాసులందరికీ 300 యూనిట్ల ఫ్రీ కరెంట్. 
  •     ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల హెల్త్ ఇన్సురెన్స్. 
  •     ఫ్రీ రేషన్ కిట్స్, రూ.500కే సిలిండర్.  
  •     నిరుద్యోగులకు రూ.8,500 భృతి.