న్యూఢిల్లీ: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఆప్ విఫలమైందని, ఢిల్లీని ఆ పార్టీ నాశనం చేసిందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి మీడియాతో మట్లాడారు. యమునా నదిని శుభ్రం చేయడం, ఢిల్లీని కాలుష్యరహితంగా మార్చడం వంటి హామీలను 2020 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ ఇచ్చింది.. కానీ వాటిని నెరవేర్చడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆరోపించారు.
ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అబద్ధాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారని.. ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నించడం లేదని తెలిపారు. ‘‘భారీ ప్రభుత్వ భవనాలను స్వీకరించనని, తన వ్యాగన్ ఆర్ కారులో మాత్రమే ప్రయాణిస్తానని చెప్పి కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు.
ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ‘శీష్ మహల్’ ను నిర్మించుకున్నారు. ఆప్ ఢిల్లీని పూర్తిగా నాశనం చేసింది’’ అని హర్దీప్ సింగ్ పురి చెప్పారు.