న్యూఢిల్లీ: ఢిల్లీలోని 70 అసెంబ్లీ సీట్లకు బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని ఆప్బలంగా పోరాడుతున్నది. ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
బీజేపీ దాదాపు 22 రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించింది. 25 ఏండ్లుగా ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేదు. 2013 వరకు 15 ఏండ్లు ఢిల్లీలో ప్రభుత్వం నడిపిన కాంగ్రెస్ తిరిగి అధికారం పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దీంతో ఈ ఎన్నికల ప్రచారం చాలా హాట్‌హాట్‌గా సాగింది. ఈ హైవోల్టేజ్వార్లో ఆప్, బీజేపీ తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయి.
ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ రెండూ కూడా వేరువేరుగా బరిలో దిగాయి. ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. దివ్యాంగుల కోసం 733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 7,553 మంది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం జనవరి 24 నుంచి ఫిబ్రవరి 4 వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే 6,980 మంది తమ ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భారీగా బందోబస్తు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 42 వేల మంది పోలీసులు, 220 కంపెనీల బలగాలు, 660 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పోలింగ్ శాంతియుతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా కోసం డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.78 కోట్ల విలువైన 196 కిలోల డ్రగ్స్, 1008 లీటర్ల అక్రమ లిక్కర్స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
రెండు గంటలు ముందుగానే మెట్రో సర్వీసులు
ఢిల్లీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో అదనపు మెట్రో సర్వీసులు నడిపించనున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) ప్రకటించింది. ఆ రెండు రోజులు అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పింది. “ఢిల్లీలో ఫిబ్రవరి 5న, ఫిబ్రవరి 8న కౌంటింగ్ రోజున అన్ని రూట్లలో ఢిల్లీ మెట్రో సర్వీసులు ఉదయం4 గంటలకే ప్రారంభమవుతాయి. ఎన్నికల సిబ్బంది, ఓటు వేసేందుకు వెళ్లే ప్రజలు ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు” అని డీఎంఆర్సీ తెలిపింది.