- సుప్రీంకోర్టు ఆదేశాలను,సర్కారు ఆంక్షలనూ ఖాతరు చేయని పబ్లిక్
- ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 396 గా రికార్డ్
- ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదు
న్యూఢిల్లీ, వెలుగు:దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రికార్డ్ స్థాయిలో పెరిగింది. ఢిల్లీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డులకు ఎక్కింది. దీపావళి సందర్భంగా జనం పెద్ద ఎత్తున పటాకులు కాల్చడంతో నగరమంతా పొగ కమ్మేసింది. టపాసులు కాల్చొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించినా, ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు చేసినా.. జనం పట్టించుకోలేదు. నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో అర్ధరాత్రి వరకూ పెద్ద ఎత్తున పటాకులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రికార్డ్ స్థాయిలో శబ్ద కాలుష్యం నమోదైంది. ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా పెరిగి గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) డేటా ప్రకారం.. గత మూడేండ్లలో దీపావళి, ఆ తర్వాతి రోజున ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 2022లో 312గా నమోదు కాగా, 2023లో 218గా రికార్డ్ అయింది. ఈ సారి ఏక్యూఐ ఏకంగా 330కి చేరింది. ఢిల్లీ పరిధిలో మొత్తం 39 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లు ఉండగా, 37 స్టేషన్లలో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ స్థాయికి పడిపోయింది. సీపీసీబీ ఆధ్వర్యంలో ప్రతి గంటకూ గాలి నాణ్యతను నమోదు చేసే ‘సమీర్ యాప్’లో కూడా వాయు కాలుష్యం హై లెవల్ లో నమోదైంది. ఈ డేటా ప్రకారం.. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆనందర్ విహార్, బవానా, సోనియా విహార్ వద్ద ఏక్యూఐ అత్యధికంగా 396గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బురారీలో 394, వజీర్ పూర్, రోహిణి, జహంగీర్ పూర్ లో 390, అశోక్ విహార్ లో 389, ద్వారకలో 376, ముండ్కాలో 375, ఢిల్లీ ఎయిర్ పోర్ట్, మధురలో 371, అలీపూర్ లో 355 ఏక్యూఐ నమోదైంది. అటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ఇతర ప్రాంతాల్లోనూ అర్ధరాత్రి తర్వాత నుంచి ఏక్యూ 350పైనే రికార్డయింది. ఇదే టైంలో గాలిలో పీఎం 2.5 కాలుష్య కారకాలు క్యూబిక్ మీటర్ కు 207.8 మైక్రోగ్రాములుగా నమోదైంది.
ఫలించని ప్రభుత్వ చర్యలు
ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేలా సుప్రీంకోర్టు పటాకులపై విధించిన నిషేధం సైతం ప్రజలను అడ్డుకోలేకపోయింది. సుప్రీం ఆర్డర్లు అమలు చేయడంలో ఢిల్లీ పోలీసులు ఫెయిల్ అయినట్లు తాజా కాలుష్య రికార్డులు చెబుతున్నాయి. శుక్రవారం టెంపరేచర్ కాస్త ఎక్కువ నమోదు కావడం, వేగంగా గాలులు వీయడంతో ఎయిర్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది.
13 ఏండ్లలోనే అధికంగా ప్రమాదాలు
దీపావళి రోజున 318 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ వెల్లడించారు. గత 13 ఏండ్లలో ఇవే అత్యధిక కాల్స్ అని తెలిపారు. ఇందులో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం 5 గంటలకు ఈ కాల్స్ నమోదైనట్లు పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో టపాసులు కాల్చడం వల్లే ప్రమాదాల్లోనూ ఈ పెరుగుదల నమోదైనట్లు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ప్రమాద ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా..12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.
ఆప్ సర్కారుపై బీజేపీ విమర్శలు
ఢిల్లీ కాలుష్యానికి పటాకులు కాదు.. దెబ్బతిన్న రోడ్లే కారణమని ఆప్ సర్కారుపై ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా విమర్శలు గుప్పించారు. దీపావళి నాటికి రోడ్లను బాగుచేయడంలో ఆప్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. శుక్రవారం శాస్ర్తి పార్క్ ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ కోసం ఆప్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సిటి పరిధిలో గాలి నాణ్యత మెరుగుపరిచేందుకు 200 యాంటీ స్మాగ్ గన్స్ ను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రారంభించారు.
ఏక్యూఐ ఎంతుండాలంటే..
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)ను పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 లెవెల్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఏక్యూఐ 0 నుంచి 50 మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగా (గుడ్) ఉన్నట్టు భావిస్తారు. అలాగే 51 నుంచి 100 వరకు ఉంటే ‘సంతృప్తికరం’గా, 101 నుంచి 200 వరకు ఉంటే ‘మోడరేట్’గా, 201 నుంచి 300 వరకు ఉంటే ‘పూర్’గా, 301 నుంచి 400 వరకు ఉంటే ‘వెరీ పూర్’గా, 401 నుంచి 500 వరకు ఉంటే ‘సివియర్’గా ఉన్నట్లు పేర్కొంటారు. కాగా, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, పంజాబ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ గాలి నాణ్యత శుక్రవారం పూర్ కేటగిరీకి చేరిందని ఆయా రాష్ట్రాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు వెల్లడించారు.