యమునా నదిలో మునిగి.. ఆస్పత్రిపాలైన ఢిల్లీ బీజేపీ చీఫ్

యమునా నదిలో మునిగి.. ఆస్పత్రిపాలైన ఢిల్లీ బీజేపీ చీఫ్

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునా నదిలో మునిగి ఆస్పత్రి పాలయ్యారు. 2025 నాటికి నదిని శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. ఇందుకు నిరసనగా ఆయన గురువారం నదిలో మునిగారు. అయితే, తీవ్ర విషపూరితంగా మారిన నదిలో మునగడంతో సచ్‌దేవా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరి ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. 

కాగా, ఢిల్లీలోని ఆమ్​ఆద్మీ ప్రభుత్వం యమునా నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ, నది ప్రక్షాళన కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిందని.. ఇందుకు క్షమాపణ కోరేందుకే సచ్‌దేవా నదిలో స్నానం చేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ 2025లో నది క్లీనింగ్ ప్రతిజ్ఞను గుర్తుచేస్తూ ఆయన నదిలో స్నానం చేయాలని బుధవారం సచ్‌దేవా సవాలు చేశారు. కాగా, ఈ ఘటనపై ఢిల్లీ పర్యావరణ మంత్రి, సీనియర్ ఆప్ నాయకుడు గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ఇది బీజేపీ డ్రామా అని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్, హర్యానాలోని ఆ పార్టీ ప్రభుత్వాలు శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థ్యాలను నదిలోకి వదులుతుండడంతోనే యమునా నది కలుషితం ఆవుతోందని ఆరోపించారు.