రైతులను అడ్డుకోవడానికి పోలీసులతో భద్రత

రైతులను అడ్డుకోవడానికి పోలీసులతో భద్రత

 

న్యూఢిల్లీ: పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన ఉత్తరప్రదేశ్‌‌ రైతులను కట్టడి చేసేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఢిల్లీ--–ఉత్తరప్రదేశ్, ఢిల్లీ–-హర్యానా సరిహద్దుల వద్ద బారికేడ్లతో 5 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది మోహరించారు. 

ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ కూడా  రంగంలోకి దిగాయి. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్రం చట్టం తీసుకురావాలని, పంటల బీమా, 2020లో జరిగిన ఆందోళన సందర్భంగా తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్  చేస్తూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు.

నోయిడా, గ్రేటర్ నోయిడాలోని సుమారు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు వీధుల్లోకి వచ్చారు. అందరూ పార్లమెంటు ముట్టడికి బయలుదేరారు. వారి నిరసన ప్రదర్శనను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దాంతో  ఢిల్లీ- ఎన్‌‌సీఆర్‌‌లోని అనేక ప్రాంతాల్లో  భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో  ఫిబ్రవరి13న పార్లమెంట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టాలని ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రైతు సంఘాలు నిర్ణయించాయి.