
- బడ్జెట్లో కేటాయింపులు జరిపిన ఢిల్లీ సర్కారు
- రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్
న్యూఢిల్లీ: యమునా క్లీనింగ్, పునరుజ్జీవనానికి ఢిల్లీ సర్కారు బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించింది. సీఎం రేఖా గుప్తా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.లక్ష కోట్లతో బడ్జెట్ ను మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. యుమునా నది పరిశుభ్రత, పునురుజ్జీవనానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె తెలిపారు. దీంతో పాటు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) రిపేర్లు, అప్ గ్రెడేషన్ కు అదనంగా రూ.500 కోట్లు, పాత సివర్ లైన్ల రీప్లేసింగ్ కు రూ.250 కోట్లు కేటాయించారు.
ఈ సందర్భంగా సీఎం రేఖ మాట్లాడుతూ ఢిల్లీ ఎకనామిక్ హెల్త్ ను గత ఆప్ సర్కారు చెదపురుగుల్లా నాశనం చేసిందని మండిపడ్డారు. అవినీతి, అసమర్థ పాలన శకం ముగిసిపోయిందన్నారు. మూలధన వ్యయాన్ని తమ ప్రభుత్వం రూ.28 వేల కోట్లకు పెంచిందని తెలిపారు. ‘‘ఇది సాధారణ బడ్జెట్ కాదు. చరిత్రాత్మక బడ్జెట్. గత ఆప్ హయాంలో నాశనమైన ఢిల్లీని తిరిగి అభివృద్ధి బాటలో నడిపించేందుకు పడిన తొలి అడుగే ఈ బడ్జెట్” అని సీఎం వ్యాఖ్యానించారు.