జట్టు నిండా స్టార్లే.. 31 పరుగులకే అలౌటయ్యారు

జట్టు నిండా స్టార్లే.. 31 పరుగులకే అలౌటయ్యారు

ఒక జట్టు 31 పరుగులకు ఆలౌటవ్వడం అరుదుగా జరుగుతుంటుంది. ఛాంపియన్ జట్లు పసికూనలను చిత్తు చేస్తూ తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేయడం చాలా సార్లు చూసాం. కానీ స్టార్లతో నిండిన ఢిల్లీ బుల్స్ జట్టు 31 పరుగులకు ఆలౌట్ కావడం షాక్ కు గురి చేస్తుంది. నిన్న (డిసెంబర్ 4)  జరిగిన అబుదాబి T10 లీగ్‌లో భాగంగా న్యూయార్క్ స్ట్రైకర్స్ చేతిలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. 

99 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ బుల్స్ కనీస పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. క్వింటన్ డి కాక్, రిలీ రోసౌ, జాన్సన్ చార్లెస్, రోవ్‌మాన్ పావెల్, డ్వేన్ బ్రావో వంటి స్టార్స్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. డికాక్ 5 పరుగులు, రోసౌ 4 పరుగులు చేస్తే.. చార్లెస్, విన్సీ, బ్రావో డకౌటయ్యారు. రవి బొపారా ఒక్కడే 2 పరుగులతో 16 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్పిన్నర్ అకెల్ హుస్సేన్, చమిక కరుణరత్నే మూడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. 
            
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ స్ట్రైకర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 98 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గర్భాజ్ 5 సిక్సులు, 2 ఫోర్లతో 24 బంతుల్లో 50 పరుగులు చేసాడు. చివర్లో ఒడియన్ స్మిత్ 15 బంతుల్లోనే 25 పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించాడు. ఢిల్లీ బౌలర్లలో వసీం అక్రమ్ కు రెండు వికెట్లు దక్కగా.. బ్రావో, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ తీసుకున్నారు.