వేలంలో నిరాశపర్చిన KL రాహుల్.. తక్కువ ధరకే దక్కించుకున్న ఢిల్లీ

వేలంలో నిరాశపర్చిన KL రాహుల్.. తక్కువ ధరకే దక్కించుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 2025 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆటగాళ్లపై ఫ్రాంచైజ్‎లు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ముఖ్యంగా మెగా వేలంలో టీమిండియా యంగ్ క్రికెటర్స్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‎పై ఉన్న భారీ అంచనాలు నిజమయ్యాయి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో సరికొత్త రికార్డులు సృష్టించారు. రిషబ్ పంత్‎ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జైయింట్స్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‎లో ఇదే అత్యధిక ధర. పంత్ తర్వాతి స్థానంలో మరో ఇండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. 

పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు అయ్యర్‎ను కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ మెగా వేలంలో ముఖ్యంగా రిషబ్ పంత్, అయ్యర్, కేఎల్ రాహుల్ పైనే అందరి దృష్టి ఉంది. ఈ ముగ్గురు భారీ ధరకు అమ్ముడుపోతారని.. కనీసం రూ.20 కోట్లకు మించి ధర పలుకుతారని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. వేలంలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అంచనాలు మించి భారీ ధర పలుకగా.. కేఎల్ రాహుల్ మాత్రం నిరాశపర్చాడు. కనీసం రూ.20 కోట్లకు అయిన అమ్ముడుపోతాడనుకున్న కేల్ రాహుల్ కేవలం రూ.14 కోట్ల ధర మాత్రమే పలికాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు కేఎల్ రాహుల్ కొనుగోలు చేసింది. వేలంలో రాహుల్ కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడగా చివరకు ఢిల్లీ దక్కించుకుంది. గత కొంతకాలంగా  ఫామ్ లేమితో ఇబ్బంది పడుతోన్న రాహుల్‎ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజ్‎లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రాహుల్ తక్కువ ధరకే అమ్ముడుపోయాడు. కాగా, గత సీజన్‎లో లక్నో జట్టుకు కెప్టెన్‎గా వ్యవహరించిన రాహుల్.. మేనేజ్మెంట్‎తో విభేదాల కారణంగా ఆ జట్టుని వీడి వేలంలోకి వచ్చాడు.