Delhi Capitals: ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్ అందించాడు: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త అసిస్టెంట్ కోచ్

Delhi Capitals: ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్ అందించాడు: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త అసిస్టెంట్ కోచ్

ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్టాఫ్‌లో మరో సభ్యుడిని చేర్చుకుంది. మాజీ టీ20 ప్రపంచ కప్ విజేత కోచ్ మాథ్యూ మోట్‌ను ఢిల్లీ అసిస్టెంట్ హోదాలో నియమించుకుంది. క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ప్రవీణ్ ఆమ్రే  స్థానంలో మోట్‌ బాధ్యతలను స్వీకరిస్తాడు. "విజేత మా జట్టులో తిరిగి వచ్చాడు. ఢిల్లీకి స్వాగతం, మాథ్యూ మోట్" అని ఢిల్లీ క్యాపిటల్స్ తమ అసిస్టెంట్ కోచ్ ను ప్రకటించారు. 

మోట్ ఆస్ట్రేలియా మహిళల జట్టుతో పాటు ఇంగ్లాండ్ మెన్స్ జట్టుకు టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ అందించి అంతర్జాతీయ క్రికెట్ లో   అరుదైన ఘనతను సాధించారు. ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ గత ఏడాది తప్పుకున్నాడు. కోచ్‌‌గా మాథ్యూ మోట్ పదవీ కాలం నాలుగేళ్లు కాగా, సగం దారిలోనే తప్పుకున్నాడు. 2022 మేలో బాధత్యలు చేపట్టిన మోట్.. కేవలం రెండున్నరేళ్లకే గుడ్ బై చెప్పాడు. అతను కోచ్ గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ 2022 టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 

మోట్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌లపై వైట్-బాల్ సిరీస్ విజయాలను అందుకుంది. 2015 నుండి 2020 వరకు ఆస్ట్రేలియా మహిళల జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. మోట్ 2008,  2009లో కోల్ కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ గా పని చేశాడు.  హెడ్‌ కోచ్‌ హేమంగ్‌ బదానీ, డైరెక్టర్ ఆఫ్ ​క్రికెట్ వేణుగోపాల్ రావుతో కలిసి మోట్ పనిచేయనున్నాడు.