DC vs RR: బ్యాటింగ్‌లో ఢిల్లీ ధనాధన్.. రాజస్థాన్ ముందు బిగ్ టార్గెట్!

DC vs RR: బ్యాటింగ్‌లో ఢిల్లీ ధనాధన్.. రాజస్థాన్ ముందు బిగ్ టార్గెట్!

రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. బుధవారం (ఏప్రిల్ 16) అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ లో అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49: 5 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ (38) భాగస్వామ్యంతో పాటు అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34:4 ఫోర్లు, 2 సిక్సర్లు) స్టబ్స్ (18 బంతుల్లో 34: 2 ఫోర్లు, 2 సిక్సర్లు)   మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 49 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హసరంగా, తీక్షణ తలో వికెట్ తీసుకున్నారు.     

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 2 ఓవర్లలోనే 33 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్ లో ఫ్రేజర్-మెక్‌గుర్క్‌  రెండు ఫోర్లు బాదగా.. రెండో ఓవర్లో అభిషేక్ పోరెల్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ లో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. ఈ దశలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా పుంజుకుంది. ఒక చక్కని బంతితో జోఫ్రా ఆర్చర్.. ఫ్రేజర్-మెక్‌గుర్క్‌ (9) ను వెనక్కి పంపగా.. వెంటనే కరుణ్ నాయర్ (0) రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. 

రాహుల్, అభిషేక్ పోరెల్ వికెట్ కాపాడుకునే క్రమంలో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. దీంతో పరుగుల వేగం తగ్గింది. మూడో వికెట్ కు 63 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దశలో మరోసారి రాజస్థాన్ బౌలర్లు రాహుల్ తో పాటు అభిషేక్ పోరెల్ వికెట్లు తీసి ఢిల్లీని ఒత్తిడిలో నెట్టారు. అయితే అక్షర్ పటేల్ మాత్రం రెండు ఓవర్లపాటు రాజస్థాన్ బౌలర్లపై అటాకింగ్ ఆడాడు. అక్షర్ ధాటికి 16 ఓవర్లో 19 పరుగులు.. 17 ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఒక భారీ షాట్ కొట్టి ఔటైనా చివర్లో స్టబ్స్ హిట్టింగ్ చేసి జట్టు స్కోర్ ను 180 పరుగుల మార్క్ దాటించాడు.