DC vs MI: తిలక్ తడాఖా.. ఢిల్లీ ముందు భారీ స్కోర్ సెట్ చేసిన ముంబై

DC vs MI: తిలక్ తడాఖా.. ఢిల్లీ ముందు భారీ స్కోర్ సెట్ చేసిన ముంబై

ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో సత్తా చాటింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 59:6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు.. రికెల్ టన్ (41), సూర్య కుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.   

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు రికెల్ టన్, రోహిత్ శర్మ శుభారంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లో వేగంగా ఆడుతూ తొలి వికెట్ కు 5 ఓవర్లలో 47 పరుగులు జోడించారు. ఈ టోర్నీలో పేలవ ఫామ్ లో ఉన్న రోహిత్ 18 పరుగులే చేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. రికెల్ టన్ ధాటికి ముంబై తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 59పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత 41 పరుగులు చేసి రికెల్ టన్ ఔటయ్యాడు. 

Also Read :  గుండె పట్టుకున్న కోహ్లీ

ఈ దశలో స్టార్ బ్యాటర్లు తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ పరుగుల వరద పారించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 60 పరుగులు జోడించిన తర్వాత 40 పరుగులు చేసి సూర్య ఔటయ్యాడు. వెంటనే హార్దిక్ పాండ్య భారీ షాట్ కు ప్రయత్నించి రెండు పరుగులకే పెవిలియన్ కు చేరాడు. ఒక ఎండ్ లో మాత్రం తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన తిలక్.. నమన్ ధీర్ తో కలిసి జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించాడు. నామం ధీర్  17 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు.