షెఫాలీ దంచెన్‌‌‌‌..బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్​ చెక్‌‌‌‌

షెఫాలీ దంచెన్‌‌‌‌..బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్​ చెక్‌‌‌‌
  •     స్మృతి మంధాన పోరాటం వృథా
  •     జొనాసెన్‌‌‌‌కు 3 వికెట్లు

బెంగళూరు: విమెన్స్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌)లో బెంగళూరు వరుస విజయాలకు ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ చెక్‌‌‌‌ పెట్టింది. బ్యాటింగ్‌‌‌‌లో షెఫాలీ వర్మ (50), అలైసీ క్యాప్సే (46) దంచికొట్టడంతో పాటు బౌలింగ్‌‌‌‌లో జొనాసెన్‌‌‌‌ (3/21) రాణించడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ 25 రన్స్‌‌‌‌ తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 194/5 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 169/9 స్కోరుకే పరిమితమైంది. స్మృతి మంధాన (74) మెరుపులు మెరిపించినా, సబ్బినేని మేఘన (36) పోరాటం చేసినా ఆర్‌‌‌‌సీబీని గెలిపించలేకపోయారు. కాప్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

కీలక భాగస్వామ్యం.. 

ఫ్లాట్‌‌‌‌ వికెట్‌‌‌‌పై ఆరంభంలోనే ఢిల్లీకి షాక్‌‌‌‌ తగిలింది. ఐదో ఓవర్‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌ మెగ్‌‌‌‌ లానింగ్‌‌‌‌ (11) ఔటైంది. 28/1 స్కోరుతో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌‌‌ను షెఫాలీ, క్యాప్సే (46) ఆదుకున్నారు. ఈ ఇద్దరు పోటీ పడి బౌండ్రీలు బాదారు. ముఖ్యంగా షెఫాలీ క్రీజులో ఉన్నంతసేపు భారీ సిక్సర్లతో హోరెత్తించింది. ఫలితంగా పవర్‌‌‌‌ప్లేలో 45/1 స్కోరు చేసిన ఢిల్లీ ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో 84/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో షెఫాలీ 30 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసింది. 

ఈ ఇద్దరి జోరుతో ఢిల్లీ 12వ ఓవర్లో వంద స్కోరును అందుకుంది. అయితే ఇదే ఓవర్‌‌‌‌లో ఆఖరి బాల్‌‌‌‌కు షెఫాలీ ఔట్‌‌‌‌ కావడంతో రెండో వికెట్‌‌‌‌కు 82 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌ (0) డకౌటైనా, చివర్లో మారిజానె కాప్‌‌‌‌ (32), జెస్‌‌‌‌ జొనాసెన్‌‌‌‌ (36 నాటౌట్‌‌‌‌) చెలరేగిపోయారు. క్యాప్సేతో నాలుగో వికెట్‌‌‌‌కు 13 రన్స్‌‌‌‌ జత చేసిన కాప్‌‌‌‌.. జొనాసెన్‌‌‌‌తో ఐదో వికెట్‌‌‌‌కు 22 బాల్స్‌‌‌‌లోనే 48, అరుంధతి రెడ్డి (10 నాటౌట్‌‌‌‌)తో ఆరో వికెట్‌‌‌‌కు 9 బాల్స్‌‌‌‌లోనే 22 రన్స్‌‌‌‌ జోడించడంతో ఢిల్లీ భారీ టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది.  

మంధాన మెరిసినా..

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో స్మృతి మంధాన శివాలెత్తింది. ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిచిన ఆమె ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసింది. ఓవర్‌‌‌‌కు రెండు ఫోర్లు లేదా సిక్స్‌‌‌‌ బాదడంతో పవర్‌‌‌‌ప్లేలో ఆర్‌‌‌‌సీబీ 52/0 స్కోరు చేసింది. అయితే అప్పటి వరకు నిలకడగా ఆడిన డివైన్‌‌‌‌ (23) 8వ ఓవర్‌‌‌‌లో రెండు సిక్స్‌‌‌‌లతో బ్యాట్‌‌‌‌ ఝుళిపించింది. కానీ తర్వాతి ఓవర్‌‌‌‌లోనే అరుంధతి (2/38)కి వికెట్‌‌‌‌ ఇవ్వడంతో 8.3 ఓవర్లలో 77 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తొలి 10 ఓవర్లలో 85/1తో ఉన్న నిలిచిన బెంగళూరును ఢిల్లీ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. 

36 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన మంధానాను 12వ ఓవర్‌‌‌‌లో కాప్‌‌‌‌ (2/35) ఔట్‌‌‌‌ చేసింది. సబ్బినేని మేఘనతో కలిసిన రిచా ఘోష్‌‌‌‌ (19).. 15వ ఓవర్‌‌‌‌లో వరుసగా రెండు సిక్స్‌‌‌‌లు బాదింది. కానీ 16వ ఓవర్‌‌‌‌లో కాప్‌‌‌‌ దెబ్బకు పెవిలియన్‌‌‌‌కు చేరడంతో ఆర్‌‌‌‌సీబీ 138/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి డీసీ బౌలర్లు మరింత చెలరేగిపోయారు. 17వ ఓవర్‌‌‌‌లో జార్జియా వారెహామ్‌‌‌‌ (6)ను పెవిలియన్‌‌‌‌కు పంపారు. 19వ ఓవర్‌‌‌‌లో వరుస బాల్స్‌‌‌‌లో మేఘన, డి క్లెర్క్‌‌‌‌ (1)ను, ఆఖరి ఓవర్‌‌‌‌లో నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో సోఫియా మోలినెక్స్‌‌‌‌ (1), సిమ్రాన్‌‌‌‌ (2), ఆశా శోభన (0)ను ఔట్‌‌‌‌ చేశారు. ఓవరాల్‌‌‌‌గా 8 బాల్స్‌‌‌‌ తేడాలో 19 రన్స్‌‌‌‌కే 6 వికెట్లు పడటంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.  

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 194/5 (షెఫాలీ 50, డివైన్‌‌‌‌ 2/23). బెంగళూరు: 20 ఓవర్లలో 169/9 (స్మృతి 74, మేఘన 36, జొనాసెన్‌‌‌‌ 3/21).