IPL 2024‌: ఇంపాక్ట్ ప్లేయర్ సునామీ ఇన్నింగ్స్.. పంజాబ్‌ముందు ఛాలెంజింగ్ టార్గెట్

IPL 2024‌: ఇంపాక్ట్ ప్లేయర్ సునామీ ఇన్నింగ్స్.. పంజాబ్‌ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ లోనే పర్వాలేదనిపించింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ చివర్లో (10 బంతుల్లో 32, 4ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగడంతో పంజాబ్ కు ఛాలెంజింగ్ టార్గెట్ విసిరింది. ఒకదశలో భారీ స్కోర్ ఖాయమనుకున్నా.. ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు అనూకూలిస్తున్న పిచ్ పై ఢిల్లీ డీసెంట్ టోటల్ చేయడంతో ఆ జట్టు గెలుపు ఇప్పుడు బౌలర్లపై పడనుంది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆసీస్ ఓపెనర్లు మార్ష్ (20), వార్నర్(29) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 3.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. ఈ జోడీని అర్ష దీప్ సింగ్ విడగొట్టడంతో ఢిల్లీ స్కోర్ కాస్త నెమ్మదించింది. వికెట్ పడిన తర్వాత కాస్త ఆచితూచి ఆడిన ఢిల్లీ ఆ తర్వాత జోరు పెంచింది. ముఖ్యంగా హోప్ వేగంగా పరుగులు రాబట్టాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన హోప్ రబడా బౌలింగ్ లో ఔటయ్యాడు.

హోప్ ఔట్ కావడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. అయితే చివరి ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ఏకంగా 25 పరుగులు రాబట్టి ఢిల్లీని ఆదుకున్నాడు. వచ్చినవారు తక్కువ పరుగులే చేయడంతో భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. 15 నెలలు తర్వాత క్రికెట్ లోకి అడుగుపెట్టిన పంత్ 18 పరుగులు చేసి విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రబడా, హరిప్రీత్ బ్రార్,రాహుల్ చాహర్ కు తలో వికెట్ దక్కింది.