
- 12 రన్స్ తో గెలిచిన హార్దిక్ సేన
- రాణించిన తిలక్, కర్ణ్ శర్మ
- కరుణ్ నాయర్ పోరాటం వృథా
న్యూఢిల్లీ: ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. రెండేండ్ల తర్వాత మెగా లీగ్‌లో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ (40 బాల్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 89) ఖతర్నాక్ బ్యాటింగ్ షోతో ఆకట్టుకోవడంతో ఐదో విజయం ఖాయం అనుకున్న ఢిల్లీకి అద్భుత బౌలింగ్‌తో దాని సొంత గ్రౌండ్‌లో షాకిచ్చింది.
తిలక్ వర్మ (33 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59) ఫిఫ్టీకి తోడు స్పిన్నర్ కర్ణ్ శర్మ (3/36) మూడు వికెట్లతో సత్తా చాటడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టాస్ ఓడిన ముంబై తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 205/5 స్కోరు చేసింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (18) మరోసారి నిరాశ పరచగా.. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (25 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) ఆకట్టుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) కూడా ఆకట్టుకున్నారు. స్లాగ్ ఓవర్లలో నమన్ ధీర్ (17 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 193 రన్స్‌కు ఆలౌటైంది. ఛేజింగ్‌లో ఫస్ట్ బాల్‌కే మెక్‌గర్క్ (0)ను దీపక్ చహర్ గోల్డెన్ డకౌట్ చేశాడు. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్ అద్భుతమైన షాట్లతో గ్రౌండ్ నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లపై పైచేయి సాధించాడు.
ఏడేండ్ల తర్వాత ఫిఫ్టీ (22 బాల్స్‌లోనే) అందుకున్న మరో ఎండ్‌లో అభిషేక్ పోరెల్ (33) మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఓ దశలో 119/1తో నిలిచిన ఢిల్లీ ఈజీగా గెలిచేలా కనిపించింది. 11వ ఓవర్ నుంచి ముంబై బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. స్పిన్నర్ కర్ణ్ శర్మ తన వరుస ఓవర్లలో పోరెల్, స్టబ్స్ (1), కేఎల్ రాహుల్ (15)ను ఔట్ చేయగా.. శాంట్నర్ బౌలింగ్‌లో కరుణ్, బుమ్రా ఓవర్లో కెప్టెన్ అక్షర్ (9) పెవిలియన్ చేరారు. దాంతో 160/6తో ఢిల్లీ ఒక్కసారిగా డీలా పడింది. విప్రజ్ నిగమ్ (14), అశుతోష్ శర్మ (17) ఆశలు రేపినా.. ముంబై బౌలర్లు మరో చాన్స్ ఇవ్వలేదు. కర్ణ్‌శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
- ముంబై: 20 ఓవర్లలో 205/5 (తిలక్ వర్మ 59, రికెల్టన్ 41, కుల్దీప్ యాదవ్ 2/23, నిగమ్ 2/41).
- ఢిల్లీ: 19 ఓవర్లలో 193 ఆలౌట్ (కరుణ్ నాయర్ 89, పోరెల్ 33, కర్ణ్ శర్మ 3/36).