DC vs RR: చివరి ఓవర్లో స్టార్క్ మ్యాజిక్.. ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ 'టై'.. సూపర్ ఓవర్‌లోనే ఫలితం!

DC vs RR: చివరి ఓవర్లో స్టార్క్ మ్యాజిక్.. ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ 'టై'.. సూపర్ ఓవర్‌లోనే ఫలితం!

ఐపీఎల్ లో 2025లో తొలి సూపర్ ఓవర్ నమోదయింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం (ఏప్రిల్ 16) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై గా ముగిసింది. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్ లో మొదట బౌలింగ్ లో విఫలమైన రాజస్థాన్..  ఛేజింగ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51:3 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీష్ రానా (28 బంతుల్లో 51:6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేసి రాజస్థాన్ జట్టును విజయం అంచుల వరకు తీసుకెళ్లారు.

చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులే ఇచ్చి మ్యాచ్ టై చేశాడు.మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. భారీ ఛేజింగ్ లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. సూపర్ ఓవర్ లో ఫలితం తేలనుంది.      

189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు జైశ్వాల్, శాంసన్ చెలరేగడంతో పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఈ దశలో సంజు శాంసన్ (31) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ రూపంలో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత పరాగ్ (8) ను అక్షర్ పటేల్ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చాడు.

ఓపెనర్ జైశ్వాల్ కాసేపటికీ హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ కు చేరడంతో మ్యాచ్ ఢిల్లీ వైపుకు మొగ్గింది. అయితే నితీష్ రానా, జురెల్ (24) ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను విజయం ముంగిట తీసుకొచ్చారు. రానా ఔటైనా హెట్ మేయర్ తో కలిస్ జురెల్ మ్యాచ్ ఫినిష్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే స్టార్క్ చివరి ఓవర్లో మ్యాజిక్ చేసి రాజస్థాన్ విజయాన్ని దూరం చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, స్టార్క్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ లో అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49: 5 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ (38) భాగస్వామ్యంతో పాటు అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34:4 ఫోర్లు, 2 సిక్సర్లు) స్టబ్స్ (18 బంతుల్లో 34: 2 ఫోర్లు, 2 సిక్సర్లు)   మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 49 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హసరంగా, తీక్షణ తలో వికెట్ తీసుకున్నారు.