ఢిల్లీ తీన్‌‌మార్‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో గుజరాత్‌‌పై గెలుపు

ఢిల్లీ తీన్‌‌మార్‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో గుజరాత్‌‌పై గెలుపు

బెంగళూరు: ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌ విమెన్స్ ప్రీమియర్ లీగ్‌‌(డబ్ల్యూపీఎల్‌‌)లో మూడో విజయం అందుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌‌కు తోడు బ్యాటింగ్‌‌లో జెస్ జొనాసెన్ (32 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 నాటౌట్‌‌), షెఫాలీ వర్మ (27 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44) విజృంభించడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌‌ను చిత్తుగా ఓడించింది. 

దీంతో 6 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. మొదట బ్యాటింగ్‌‌కు వచ్చిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 127/9 స్కోరు చేసింది. భారతి ఫుల్మాలి (29 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్‌‌) సత్తా చాటింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మరిజేన్ కాప్‌‌, అనాబెల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 15.1 ఓవర్లలోనే 131/6  స్కోరు చేసి గెలిచింది. జొనాసెన్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే మ్యాచ్‌‌లో ముంబైతో యూపీ పోటీపడుతుంది.  

ఆదుకున్న ఫుల్మాలి

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన గుజరాత్‌‌కు ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.  ఢిల్లీ పేసర్లు శిఖా పాండే, మరిజేన్ ధాటికి ఎనిమిది బాల్స్ తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి  20/4తో డీలా పడింది. నాలుగో ఓవర్లో శిఖా పాండే.. ఓపెనర్ హర్లీన్ (5), లిచ్‌‌ఫెల్ట్‌‌ (0)ను పెవిలియన్ చేర్చగా.. మరిజేన్ వేసిన తర్వాతి ఓవర్లో బెత్ మూనీ (10), కశ్వీ గౌతమ్ (0) వరుస బాల్స్‌‌లో పెవిలియన్ చేరారు. ఈ టైమ్‌‌లో దియేంద్ర డాటిన్ (26) ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది.

కానీ, 9వ ఓవర్లో కెప్టెన్ ఆష్లే గార్డ్‌‌నర్‌‌‌‌ (3)ను టిటాస్‌‌ బౌల్డ్ చేసింది. కొద్దిసేపటికే డాటిన్‌‌ను సదర్లాండ్స్ బౌల్డ్ చేయడంతో జెయింట్స్ 60/6తో నిలిచింది. ఈ దశలో భారతి జట్టును ఆదుకుంది. కౌంటర్ ఎటాక్‌‌తో ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసిన ఆమె తనుజా కన్వార్ (16)తో ఏడో వికెట్‌‌కు కీలక 51 రన్స్ జోడించి స్కోరు వంద దాటించింది. 18వ ఓవర్లో తనుజా రనౌటైనా.. చివరి వరకూ క్రీజులో ఉన్న ఫుల్మాలి గుజరాత్‌‌కు గౌరవప్రద స్కోరు అందించింది. 

షెఫాలీ, జొనాసెన్ జోరు

ఓపెనర్ షెఫాలీ వర్మ, జొనాసెన్‌‌ ధాటిగా ఆడటంతో చిన్న టార్గెట్‌‌ను ఢిల్లీ సులువుగానే అందుకుంది. కశ్వీ వేసిన నాలుగో ఓవర్లో ఔటైన కెప్టెన్‌‌, ఓపెనర్‌‌‌‌ మెగ్ లానింగ్ (3) నిరాశపరిచినా.. షెఫాలీ, జొనాసెన్‌‌ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లారు. జొనాసెన్ వచ్చీరాగానే రెండు ఫోర్లతో అలరించగా.. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న షెఫాలీ.. డాటిన్ వేసిన ఐదో ఓవర్లో 6, 4తో జోరు పెంచింది. 

గుజరాత్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా వీళ్లకు కలిసొచ్చాయి. 16 రన్స్ వద్ద జొనాసెన్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను తనుజా డ్రాప్ చేసింది. ప్రియా మిశ్రా బౌలింగ్‌‌లో జొనాసెన్‌‌, షెఫాలీ చెరో సిక్స్‌‌తో మరింత స్పీడు పెంచారు. గార్డ్‌‌నర్‌‌‌‌ బౌలింగ్‌‌లో 6,4 కొటిన షెఫాలీ తర్వాతి బాల్‌‌కే ఎల్బీ అవ్వడంతో మూడో వికెట్‌‌కు 74 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. వర్మ వెనుదిరిగినా..జొనాసెన్‌‌ అదే జోరు కొనసాగించింది. 26 బాల్స్‌‌లో లీగ్‌‌లో తొలి ఫిఫ్టీ అందుకుంది. జెమీమా (5), సదర్లాండ్ (1) ఔటైనా.. మరిజేన్‌‌ కాప్ (9 నాటౌట్‌‌)తో కలిసి గెలుపు లాంఛనం పూర్తి చేసింది. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌‌: 20 ఓవర్లలో 127/9 (ఫుల్మాలి 40 నాటౌట్‌‌, డాటిన్ 26, మరిజేన్ 2/17, శిఖా 2/18).
ఢిల్లీ: 15.1 ఓవర్లలో 131/4 (జొనాసెన్ 61 నాటౌట్‌‌, షెఫాలీ 44, కశ్వీ గౌతమ్ 2/26).