- 10 రన్స్ తేడాతో హార్దిక్‌సేన ఆరో ఓటమి
- చెలరేగిన మెక్‌గర్క్, స్టబ్స్, హోప్
- తిలక్, హార్దిక్ పోరాటం వృథా
న్యూఢిల్లీ: ఐపీఎల్–17లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంటే.. ముంబై ఇండియన్స్ ఆరో ఓటమితో ప్లే ఆఫ్ రేస్‌కు మరింత దూరమైంది. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (27 బాల్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84), ట్రిస్టాన్ స్టబ్స్ (25 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 నాటౌట్), షై హోప్ (17 బాల్స్‌లో 5 సిక్స్‌లతో 41) సూపర్ హిట్ బ్యాటింగ్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో డీసీ 10 రన్స్ తేడాతో ముంబైకి చెక్ పెట్టింది. టాస్ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 257/4 స్కోరు చేయగా, ముంబై 20 ఓవర్లలో 247/9 స్కోరు వద్దే ఆగిపోయింది. తిలక్ వర్మ (32 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63), హార్దిక్ పాండ్యా (46) పోరాడి విఫలమయ్యారు. మెక్‌గర్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
హిట్టింగ్ వీరులు..
డీసీ ఇన్నింగ్స్‌లో మెక్‌గర్క్, స్టబ్స్ పరుగుల సునామీ సృష్టించారు. లూక్ వుడ్ (1/68) ఫస్ట్ ఓవర్‌లోనే మెక్‌గర్క్ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో మొదలుపెట్టిన విధ్వంసం పవర్ ప్లే మొత్తం కొనసాగింది. రెండో ఓవర్‌లో బుమ్రా (1/35).. 18 రన్స్ ఇచ్చుకోగా, మూడో ఓవర్ నుంచి మెక్‌గర్క్ సునామీ తారాస్థాయికి చేరింది. ఈ ఓవర్‌లో మూడు ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో 15 బాల్స్‌లోనే ఫిఫ్టీ కొట్టాడు. దాంతో ఈ సీజన్‌లో తాను నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును మరోసారి సమం చేశాడు. కెప్టెన్ పాండ్యా బౌలింగ్‌లో 4,6,4,6తో రెచ్చిపోయిన మెక్‌గర్క్ ఆరో ఓవర్‌లో మూడు రన్సే చేశాడు.
మొత్తానికి పవర్‌ప్లేలో ముంబై 92/0 స్కోరుతో నిలిచింది. రెండో ఎండ్‌లో అభిషేక్ పోరెల్ (36) నెమ్మదిగా ఆడగా, 7వ ఓవర్‌లో మెక్‌గర్క్ ఓ ఫోర్, రెండు సిక్స్‌లతో జోరు కొనసాగించాడు. కానీ 8వ ఓవర్‌లో చావ్లా (1/36) మెక్‌గర్క్‌ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 114 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే రెండు ఫోర్లతో బ్యాట్ ఝుళిపించిన అభిషేక్‌ను 10వ ఓవర్‌లో నబీ (1/20) పెవిలియన్‌కు పంపడంతో స్కోరు 128/2గా మారింది.
ఈ దశలో హోప్ మూడు సిక్స్‌లు, పంత్ (29) 4, 6తో హిట్టింగ్ మొదలుపెట్టారు. కానీ 14వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన హోప్‌ను ఔట్ చేసిన వుడ్ మూడో వికెట్‌కు 53 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఇక్కడి నుంచి స్టబ్స్ వీరవిహారం మొదలైంది. మధ్యలో పంత్ ఫోర్, సిక్స్ కొట్టినా, 18వ ఓవర్‌లో స్టబ్స్ 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 26 రన్స్ దంచాడు. 19వ ఓవర్‌లో పంత్ వెనుదిరగడంతో నాలుగో వికెట్‌కు 53 రన్స్ పార్ట్ నర్‌షిప్ బ్రేక్ అయింది. చివరి ఓవర్‌లో స్టబ్స్, అక్షర్ (11 నాటౌట్) చెరో సిక్స్‌తో స్కోరు 250 దాటించారు.
తిలక్ పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ముంబై చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. పవర్‌ప్లేలోనే రోహిత్ (8), ఇషాన్ కిషన్ (20), సూర్యకుమార్ (26) వికెట్లు పడటంతో ముంబై 65/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో తిలక్ వర్మ, హార్దిక్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. మూడో వికెట్‌కు 71 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. డీసీ బౌలర్లను టార్గెట్ చేస్తూ భారీ హిట్టింగ్‌తో 9వ ఓవర్లోనే స్కోరును 100 దాటించారు. తిలక్ 25 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్‌లో రసిక్ ధార్(3/34) ముంబై ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు.
మూడు బాల్స్ తేడాతో హార్దిక్, నేహల్ వదేరా (4)ను ఔట్ చేశాడు. తిలక్‌తో కలిసిన టిమ్ డేవిడ్ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మూడు భారీ సిక్స్‌లతో టీమ్ స్కోరు 200 దాటించాడు. అయితే 18వ ఓవర్‌లో ముకేశ్ (3/59).. డేవిడ్‌ను ఔట్ చేసి ఐదో వికెట్‌కు 70 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేయడంతో ముంబై కష్టాలు పెరిగాయి. అయినా తిలక్ చివరి వరకు ప్రయత్నించాడు. చివరి12 బాల్స్‌లో 41 రన్స్ అవసరమైన టైమ్‌లో నబీ (7) ఔట్ మ్యాచ్‌ను డీసీ వైపు తిప్పింది. ఆఖరి ఓవర్లో 25 రన్స్ అవసరం అవగా.. తొలి బాల్‌కు తిలక్ రనౌట్ కాగా.. చివరి బాల్‌కు చావ్లా (10) వెనుదిరగడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 257/4 (మెక్‌గర్క్ 84, స్టబ్స్ 48*, బుమ్రా 1/35).
ముంబై: 20 ఓవర్లలో 247/9 (తిలక్ 63, పాండ్యా 46, రసిక్ ధార్ 3/34).