DC vs RR: రాజస్థాన్‌ను మట్టికరిపించిన ఢిల్లీ.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

DC vs RR: రాజస్థాన్‌ను మట్టికరిపించిన ఢిల్లీ.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ సంజు శాంసన్(46 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సులు) అసాధారణంగా పోరాడినా ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ కు పరాజయం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ జైస్వాల్ నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో బట్లర్ సహకారంతో సంజు శాంసన్ చెలరేగి ఆడాడు. ఢిల్లీ బౌలర్లపై చితక్కొడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. పవర్ ప్లే చివరి ఓవర్ లో బట్లర్ (19) ఔటైనా.. పరాగ్ తో కలిసి సంజు పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. పరాగ్ (27), యాష్ దూబే (25) లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సంజు.. 16 ఓవర్లో ఔటయ్యాడు. 

అప్పటివరకు రాజస్థాన్ వైపు ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ఢిల్లీ వైపు మళ్లింది. చివర్లో రాజస్థాన్ బ్యాటర్లు వరుస పెట్టి పెవిలియన్ కు చేరడంతో రాజస్థాన్ వరుసగా రెండో పరాభవం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్  అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్, రాసిక్ దర్ తలో వికెట్ పడగొట్టారు.                   

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65, 7 ఫోర్లు, 3 సిక్సులు) మెక్‌గుర్క్(20 బంతుల్లో 50, 3 సిక్సులు, 7 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. చివర్లో స్టబ్స్ (20 బంతుల్లో 41, 3 ఫోర్లు, 3 సిక్సులు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. బోల్ట్, సందీప్ శర్మ, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.