DC vs RCB: బెంగళూరును ఓడించిన రాహుల్.. ఓటమి లేని జట్టుగా దూసుకెళ్తున్న ఢిల్లీ

DC vs RCB: బెంగళూరును ఓడించిన రాహుల్.. ఓటమి లేని జట్టుగా దూసుకెళ్తున్న ఢిల్లీ

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ హవా కొనసాగుతుంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం (ఏప్రిల్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించడంతో పాటు ఛేజింగ్ లో కేఎల్ రాహుల్(53 బంతుల్లో 93: 7 ఫోర్లు, 6 సిక్సర్లు) అసాధారణంగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి గెలిచింది.

164 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఘోరమైన ఆరంభం లభించింది. టాపార్డర్ లో ముగ్గురూ సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు.  ఓపెనర్లు డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (7)తో పాటు అభిషేక్ పోరెల్ (7) ఔటయ్యాడు. దీంతో 30 పరుగులకే ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అక్షర్ పటేల్ కాసేపు క్రీజ్ లో ఉండి 15 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ దశలో ఆర్సీబీ గెలుస్తుందనే ఆశలు చిగురించాయి. అయితే రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ను గెలిపించాడు. 

Also Read : బ్యాటింగ్‌లో బెంగళూరు తడబాటు

ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్ లో ఉండి బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు. 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో స్టబ్స్ (38) రాహుల్ కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 111 పరుగులు జోడించి బెంగళూరు విజయానికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. యష్ దయాల్, సాయుశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సాల్ట్ (17 బంతుల్లో 37:4 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (37) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.