DC vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం.. వైజాగ్‌లో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్

DC vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం.. వైజాగ్‌లో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్

విశాఖ పట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో ఓడిపోయింది. టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా రెండో పరాజయం. బ్యాటింగ్ లో అనికేత్ వర్మ, బౌలింగ్ లో నీషన్ తప్పితే మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. మరోవైపు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లలో మూడు వికెట్లను 166 పరుగులు చేసి గెలిచింది. 

164 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా ఛేజ్ చేశారు. ఓపెనర్లు డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలి వికెట్ కు 81 పరుగులు జోడించి మ్యాచ్ ను ఏకపక్షం చేశారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటయ్యారు. డుప్లెసిస్ 27 బంతుల్లో 50 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా..ఫ్రేజర్-మెక్‌గుర్క్ 38 పరుగులు చేసి రాణించాడు. ఆ తర్వాత కాసేపటికే సిక్స్, ఫోర్ కొట్టి మంచి టచ్ లో కనిపించిన రాహుల్ బౌల్డయ్యాడు. మూడు వికెట్లు జీషన్ అన్సారీ తీసుకోవడం విశేషం. అభిషేక్ పోరెల్ (34), స్టబ్స్ (21) ఎలాంటి ఒత్తిడి లేకుండా మ్యాచ్ ను ముగించారు. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. యువ బ్యాటర్ అనికేత్ వర్మ (41 బంతుల్లో 74: 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మినహాయిస్తే మిగిలిన వారు కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు టోర్నీలో ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.