LSG vs DC: అభిషేక్, రాహుల్ హాఫ్ సెంచరీలు.. లక్నోపై ఢిల్లీ అలవోక విజయం

LSG vs DC: అభిషేక్, రాహుల్ హాఫ్ సెంచరీలు.. లక్నోపై ఢిల్లీ అలవోక విజయం

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ హవా కొనసాగుతుంది. ఈ సీజన్ లో ఆరో విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్ రేస్ లో దూసుకెళ్తుంది. మంగళవారం (ఏప్రిల్ 22) లక్నో సూపర్ జయింట్స్ పై 8 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఛేజింగ్ లో అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 51: 5 ఫోర్లు, సిక్సర్) కేఎల్ రాహుల్ (57) హాఫ్ సెంచరీలు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్ లో ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలిచింది. 

160 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభం వచ్చింది. అభిషేక్ పోరెల్ తొలి ఓవర్లో 15 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించాడు. తొలి వికెట్ కు 36 పరుగులు జోడించిన తర్వాత కరుణ్ నాయర్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో రాహుల్, అభిషేక్ పోరెల్ తమ సూపర్ బ్యాటింగ్ తో జట్టును ముందుండి నడిపించారు. రెండో వికెట్ కు 69 పరుగులు జోడించి గెలుపుకు బాటలు వేశారు. ఈ క్రమంలో అభిషేక్.. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

Also Read : నేను ఉంటే గెలిపించే వాడిని.. రిటైర్డ్ ఔట్‌పై తిలక్ వర్మ ఎమోషనల్  

12 ఓవర్లో అభిషేక్ పోరెల్ ఔటైనా అప్పటికే మ్యాచ్ ఢిల్లీ చేతిలోకి వచ్చింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ రాహుల్ తో కలిసి స్కోర్ వేగాన్ని పెంచాడు. మరో ఎండ్ లో క్రీజ్ లో పాతుకుపోయిన రాహుల్.. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో అక్షర్ పటేల్ 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో మార్కరం రెండు వికెట్లు తీసుకున్నాడు.       

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ మార్కరం (33 బంతుల్లో 52:2 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్ష్ (45) ఇచ్చిన సూపర్ స్టార్ట్ ను వినియోగించుకోలేక ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్, చమీరాలకు తలో వికెట్ దక్కింది.