- వార్నర్, పంత్ హాఫ్ సెంచరీలు
- రహానె, మిచెల్, ధోనీ పోరాటం వృథా
విశాఖపట్నం: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. డేవిడ్ వార్నర్ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), రిషబ్ పంత్ (32 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో 20 రన్స్ తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన ఢిల్లీ 20 ఓవర్లలో 191/5 స్కోరు చేసింది. గత మ్యాచ్‌లకు భిన్నంగా ఈసారి ఓపెనర్లు వార్నర్, పృథ్వీ షా (43) మెరుపు ఆరంభాన్నిచారు.
తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడినా... తర్వాత ఇద్దరు పోటీపడి బౌండ్రీలు, సిక్సర్లు బాదారు. ముఖ్యంగా వార్నర్ 4, 6, 6, 4, 4, 4 దంచాడు. ఆరో ఓవర్‌లో షా 4 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో డీసీ 62/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లలో 4, 6తో చెలరేగిన వార్నర్ 32 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 10వ ఓవర్‌లో ముస్తాఫిజుర్ (1/47) దెబ్బకు ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 93 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆరు బాల్స్ తర్వాత పృథ్వీ కూడా వెనుదిరగడంతో స్కోరు 103/2గా మారింది.
ఈ టైమ్‌లో రిషబ్ ధనాధన్ బ్యాటింగ్ చేసినా, పతిరణ (3/31) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 15వ ఓవర్‌లో 3 బాల్స్ తేడాలో మార్ష్ (18), స్టబ్స్ (0)ను పెవిలియన్‌కు చేర్చడంతో డీసీ 134/4తో నిలిచింది. రెండో వైపు పంత్ 4, 6, 6, 4, 4తో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 31 బాల్స్‌లోనే ఫిఫ్టీ కొట్టాడు. కానీ ఐదో వికెట్‌కు 44 రన్స్ జోడించి పతిరణకు వికెట్ ఇచ్చాడు. చివర్లో అభిషేక్ పోరెల్ (9*), అక్షర్ పటేల్ (7*) ఫర్వాలేదనిపించడంతో చివరి 10 ఓవర్లలో 96 రన్స్ వచ్చాయి.
ఆఖర్లో మెరుపులు..
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో171/6 స్కోరు చేసింది. అజింక్యా రహానె (45) టాప్ స్కోరర్. డారిల్ మిచెల్ (34) రాణించాడు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే రుతురాజ్ (1), మూడో ఓవర్‌లో రచిన్ రవీంద్ర (2) ఔట్‌కావడంతో సీఎస్కే 7/2 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో రహానె, మిచెల్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. పవర్‌ప్లేలో 32/2 స్కోరు చేసిన చెన్నైని క్రమంగా గట్టెక్కించారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు సిక్స్‌లు కొట్టి మూడో వికెట్‌కు 68 (45 బాల్స్‌లో) రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను సుస్థిరం చేశారు.
అయితే 11వ ఓవర్‌లో అక్షర్ పటేల్ (1/20).. మిచెల్‌ను ఔట్ చేశాడు. కానీ 14వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో రహానె, సమీర్ రిజ్వి (0)ని, 17వ ఓవర్‌లో శివమ్ దూబె (18)ను ఔట్ చేసిన ముకేశ్ (3/21) మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తీసుకెళ్లాడు. దీంతో సీఎస్కే120/6తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ టైమ్‌లో జడేజా (21*), ధోనీ (16 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37*) బ్యాట్లు ఝుళిపించారు. 17వ ఓవర్‌లో మూడు ఫోర్లతో 17, తర్వాతి ఓవర్‌లో మహీ 6తో 12 రన్స్ వచ్చాయి. చివరి 12 బాల్స్‌లో 46 రన్స్ అవసరం కాగా, ధోనీ 4, 6, 4, 6తో ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఖలీల్‌అహ్మద్(2/21)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 191/5 (వార్నర్ 52, పంత్ 51, పతిరణ 3/31).
చెన్నై: 20 ఓవర్లలో 171/6 (రహానె 45, మిచెల్ 34, ధోనీ 37*, ముకేశ్ 3/21).