కేజ్రీవాల్ కుర్చీని అలాగే వదిలేసి మరో కుర్చీలో ఢిల్లీ సీఎం ఆతిశీ..!

కేజ్రీవాల్ కుర్చీని అలాగే వదిలేసి మరో కుర్చీలో ఢిల్లీ సీఎం ఆతిశీ..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 21న ప్రమాణ స్వీకారం చేసిన ఆతిశీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె బాధ్యతలు స్వీకరించిన విధానం కొంత నాటకీయతకు దారితీసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు కూర్చున్న కుర్చీలో ఆమె కూర్చోలేదు. ఆ కుర్చీ పక్కనే మరో కుర్చీలో కూర్చుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్స్పై సంతకం చేశారు. 

ఈ పరిణామం.. భారత ఇతిహాసమైన రామాయణంలోని ఒక ఘట్టాన్ని తలపించింది. శ్రీరాముడు అడవులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో  భరతుడిపై రాజ్య భారం పడుతుంది. ఆ సందర్భంలో రాజ్య పాలనపై భరతుడు అనాసక్తి కనబరుస్తాడు. శ్రీరాముడి ఉపదేశంతో ఎట్టకేలకు రాజ్య పాలనకు అంగీకరిస్తాడు. రామచంద్రుడి పాదుకలను సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్య పాలన సాగిస్తాడు.

ALSO READ | బీజేపీ దారి తప్పుతుంటే ఆర్ఎస్ఎస్ ఏంచేస్తోంది.. అర్వింద్ కేజ్రీవాల్

ఆతిశీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విధానం ఈ ఘట్టాన్ని గుర్తుచేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆమెను కొనియాడుతున్నారు. ఆతిశీ పెద్ద డ్రామాకు తెరలేపిందని బీజేపీ ఎద్దేవా చేసింది. ఢిల్లీకి కొత్త మన్మోహన్ సింగ్ వచ్చారని భారతీయ జనతా పార్టీ నేత షెహ్జద్ పూనావాలా తన ‘ఎక్స్’ ఖాతాలో ఆ ఖాళీ కుర్చీతో ఆతిశీ ఉన్న ఫొటోను పోస్ట్ చేసి మరీ వెటకారం చేశారు. కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీలో కూర్చోకుండా మరో కుర్చీలో కూర్చోవడంపై ఆతిశీ స్పందించారు. ‘‘ఆ చైర్ అర్వింద్ కేజ్రీవాల్ జీది.. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్’’ అని ఆమె సింపుల్గా ఈ విమర్శలకు చెక్ పెట్టారు.

దేశ రాజధాని ఢిల్లీకి ఆతిశీ ఎనిమిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. 2025, ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ పదవిలో కొద్దిరోజులు మాత్రమే ఉండనున్నారు. కాగా ఆతిశితో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. సుల్తాన్పూర్ మిర్జా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్కు కూడా ఢిల్లీ ప్రభుత్వ కేబినేట్లో చోటు దక్కడం విశేషం.