
- రాంలీలా మైదాన్‌లో ఏర్పాట్లు పూర్తి
- బుధవారం బీజేఎల్పీ మీటింగ్‌లో ఎన్నిక
- 12 రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెర
- ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేరేఖకు ముఖ్యమంత్రి పదవి
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం ఎవరనే విషయంలో దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు బుధవారం సాయంత్రం తెరపడింది. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా(50)ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ సీఎంగా మరోసారి మహిళ పగ్గాలు చేపట్టనున్నారు.
సుష్మా స్వరాజ్(బీజేపీ), షీలా దీక్షిత్(కాంగ్రెస్), అతిశీ(ఆప్) తర్వాత రేఖా గుప్తా ఢిల్లీ నాల్గవ మహిళా ముఖ్యమంత్రిగా నిలవనున్నారు. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రమాణ స్వీకారం జరగనుంది. ఐకానిక్ రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి బీజేపీ పెద్దలంతా అటెండ్ కానున్నారు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ 'ఎక్స్' హ్యాండిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
ఏబీవీపీ మెంబర్ నుంచి సీఎం పదవి దాకా..
రేఖా గుప్తా హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో 1974 జూలై 19 జన్మించారు. ఆమె తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. రేఖా గుప్తా రెండేండ్ల వయసు(1976)లో వారి కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదివేటప్పుడే రేఖా గుప్తా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు. 1996 నుంచి-1997 మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్ యూ) అధ్యక్షురాలిగా పనిచేశారు. రేఖా గుప్తా రాజకీయ జీవితం 2000లో ప్రారంభమైంది.
2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎమ్)లో చేరి ఢిల్లీ యూనిట్‌లో కార్యదర్శిగా పనిచేసి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2007లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2009 వరకు ఎమ్ సీడీలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక కీలక పదవులను నిర్వహించారు.
2015, 2020లో ఢిల్లీ ఎన్నికలలో షాలిమార్ బాగ్ స్థానానికి పోటీ చేశారు. కానీ రెండు సార్లు ఆప్ అభ్యర్థి బందన కుమారి చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ షాలిమార్ బాగ్ నుంచి పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి బందన కుమారిని 29 వేల ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అంకితభావంతో పనిచేస్త : రేఖా గుప్తా
ఢిల్లీ సీఎంగా తనను ఎంపిక చేయడం పట్ల రేఖా గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ హైకమాండ్ కు థ్యాంక్స్ చెప్పారు. " నాపై నమ్మకం ఉంచి సీఎంగా బాధ్యత అప్పగించినందుకు బీజేపీ హైకమాండ్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన సపోర్ట్ నాకు కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చాయి. వచ్చే ఐదేండ్లు ఢిల్లీ లోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్ర అభివృద్ధి కోసం నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ఈ అవకాశానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను" అని రేఖ ట్వీట్ చేశారు.