Tihar Jail: పెద్దపెద్దోళ్లే చిప్పకూడు తిన్న.. తీహార్ జైలు షిఫ్ట్.. డిసైడ్ అయిన ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం

Tihar Jail: పెద్దపెద్దోళ్లే చిప్పకూడు తిన్న.. తీహార్ జైలు షిఫ్ట్.. డిసైడ్ అయిన ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం

ఢిల్లీ: తీహార్ జైలు పేరు వినే ఉంటారు. ఈ తీహార్ జైలును అక్కడ నుంచి ఢిల్లీ నగర శివార్లకు తరలించాలని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ నగర శివార్లలో అనువైన ప్రాంతాన్ని శోధించేందుకు సర్వే చేయాలని, ఆ సర్వేకు బడ్జెట్లో పది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం (మార్చి 25, 2025) ప్రకటించారు. ఢిల్లీకి సమీపంలోని తీహార్ అనే గ్రామంలో 1957లో ఒక చిన్న జైలును నిర్మించారు. ఢిల్లీ ప్రాంతంలోని ఖైదీలను ఉంచేందుకు ఈ జైలును నిర్మించారు.

కాలక్రమేణా తీహార్ జైలు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయారు. దేశంలోని సెంట్రల్ జైళ్ల ప్రస్తావన వచ్చిన సందర్భంలో తీహార్ జైలు రాకుండా ఉండదు. అంతగా తీహార్ జైలు అనే పేరు జనం నోళ్లలో నానింది. దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో, నిఘా నీడలో ఉండే తీహార్ జైలులో పేరు మోసిన క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్స్, రాజకీయ నాయకులు, వీఐపీలు జైలు శిక్షను అనుభవించారు.

12 వందల 73 మంది నేరస్తులను ఉంచేంత సామర్థ్యంతో కట్టిన ఈ తీహార్ జైలు రానురానూ 5 నుంచి 6  వేల మంది నేరస్తులను ఉంచేంతలా నిర్మించారు. ప్రస్తుతం 13 వేల మందికి పైగా ఖైదీలు తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ కాంప్లెక్స్లో మొత్తం 9 జైళ్లు ఉన్నాయి.1994లో కిరణ్ బేడీ జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టాక తీహార్ జైలులో పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ALSO READ | ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు.. సోనూసూద్ భార్యకు గాయాలు

జైళ్లలో ఖైదీలకు చదువు చెప్పించి వాళ్లలో పరివర్తనకు ఆమె కృషి చేశారు. వొకేషనల్ ట్రైనింగ్, మెడిటేషన్.. ఇలా ఖైదీల్లో పరివర్తన కోసం కిరణ్ బేడీ ఎంతగానో ప్రయత్నించారు. తీహార్ సెంట్రల్ జైలు ఖైదీలు పలు రకాల ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఫర్నీచర్, టెక్ట్స్ టైల్స్ సంబంధిత ఉత్పత్తులను తయారుచేసి ఆ ఉత్పత్తులకు తీహార్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు.

దేశంలో పలు నేరారోపణలు, అభియోగాలు ఎదుర్కొన్న ఎంతోమంది ప్రముఖులు ఈ తీహార్ జైలులో గడిపిన వాళ్లే కావడం గమనార్హం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ తీహార్ జైలులోనే గడిపారు. అంతెందుకు.. దేశంలోనే తీవ్ర చర్చకు దారితీసిన నిర్భయ దోషులకు ఉరి శిక్షను కూడా తీహార్ జైలులోనే అమలు చేశారు.