ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం..మోదీ యూఎస్ టూర్ తర్వాతే!

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం..మోదీ యూఎస్ టూర్ తర్వాతే!
  • నేటి నుంచి 13వ తేదీ వరకు ప్రధాని విదేశీ పర్యటన
  • 13 తర్వాతే ప్రమాణం ఉండే అవకాశం
  • బీజేపీ వర్గాల వెల్లడి.. సీఎంను తేల్చేందుకు హైలెవల్ ​మీటింగ్స్​
  • సీఎం రేసులో ఐదుగురి పేర్లు తెరపైకి
  • ఢిల్లీ సీఎం పదవికి ఆతిశి రాజీనామా

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఓడించి దాదాపు 26 ఏండ్ల తర్వాత   జెండా ఎగురవేసిన బీజేపీ అదే ఉత్సాహంతో సీఎం ప్రమాణ స్వీకారాన్ని  గ్రాండ్​గా నిర్వహించేందుకు  ప్లాన్​ చేస్తున్నది. అయితే, ప్రధాని సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు (ఫిబ్రవరి 13 వరకు) ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన ఇండియాకు తిరిగొచ్చాక.. అంటే ఫిబ్రవరి 13 తర్వాతే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్​ చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో 70 సీట్లకుగానూ 48 సీట్లు గెలుచుకొని బీజేపీ అధికారం దక్కించుకున్నది. అధికార ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ చీఫ్​ అర్వింద్​ కేజ్రీవాల్​సహా కీలక నేతలందరూ ఓడిపోయారు. 

సీఎం ఎంపికకు కసరత్తు

సీఎం క్యాండిడేట్​ఎవరో చెప్పకుండానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన బీజేపీ.. అనూహ్య విజయం సాధించింది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  భేటీ అయ్యారు. కొత్త సీఎం ఎంపిక విషయంలో అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని విస్తృత సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.  కాగా, సీఎం రేసులో ఉన్నారంటూ తెరపైకి 5 పేర్లు వచ్చాయి.  ఆప్‌‌ చీఫ్​ కేజ్రీవాల్‌‌ను ఓడించిన జాట్‌‌ వర్గ నేత పర్వేశ్‌‌ వర్మతో పాటు సతీశ్‌‌ ఉపాధ్యాయ్‌‌, విజేందర్‌‌ గుప్తా, ఆశిష్‌‌ సూద్‌‌, పవన్​శర్మ​పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాగా,  పూర్వాంచల్‌‌ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉండొచ్చని ఓ బీజేపీ నేత అన్నట్టు సమాచారం. 2023లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌‌, నిరుడు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ అందరి ఊహాగానాలకు అందకుండా సీఎంలను ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్‌‌లో మోహన్‌‌ యాదవ్‌‌, రాజస్థాన్‌‌లో భజన్‌‌లాల్‌‌ శర్మ, ఒడిశాలో మోహన్‌‌ చరణ్‌‌ మాఝీలను పీఠంపై కూర్చోబెట్టి, రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఈ నేపథ్యంలో హస్తిన సీఎం ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. 

ఎల్జీ అపాయింట్​మెంట్​ కోరిన బీజేపీ 

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సమాయత్తమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో లెఫ్టినెంట్ గవర్నర్‌‌ వీకే సక్సేనాను కలుసుకునేందుకు అపాయింట్​మెంట్​ కోరింది.  ఈ మేరకు ఎల్జీకి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌‌దేవ లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, సిటీకి చెందిన లోక్‌‌సభ ఎంపీలు సాధ్యమైనంత త్వరగా మిమల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారని, వీలుచూసుకుని అపాయింట్‌‌మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.

కేజ్రీవాల్​ ఎలాంటి అభివృద్ధి చేయలే: హర్యానా సీఎం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆప్ చీఫ్​ కేజ్రీవాల్​పై హర్యానా సీఎం నాయబ్​సింగ్​ సైనీ పలు విమర్శలు చేశారు. ఆయన ఎప్పుడూ ఢిల్లీ అభివృద్ధికోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులను నిందించేవారని అన్నారు. ‘‘ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఢిల్లీ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. గత పదేండ్లుగా అక్కడ ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేసే ప్రభుత్వమే ఉంది” అని పేర్కొన్నారు.  యమునా నది శుద్ధితోసహా ఏ హామీని అర్వింద్​ కేజ్రీవాల్​ నెరవేర్చలేదని అన్నారు. యమునా నదిని క్లీన్​ చేయకుంటే 2025లో ఓట్లు అడగనని కేజ్రీవాల్​ అన్నారని, కానీ అలా చేయకుండా.. యమునా నదిలో హర్యానా విషం కలిపిందంటూ అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. కేజ్రీవాల్​ మాయమాటలను ప్రజలు అర్థం చేసుకొని, తగిన తీర్పు ఇచ్చారని సైనీ పేర్కొన్నారు.

ఢిల్లీ సీఎం పదవికి ఆతిశీ రాజీనామా

ఢిల్లీ సీఎం పదవికి ఆతిశీ రాజీనామా చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్ వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను అందజేశారు. శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చేతిలో ఆప్ ఓడిపోవడంతో ఆమె రిజైన్​ చేశారు.  కాల్కాజీ నియోజకవర్గం నుంచి ఆతిశీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రమేశ్‌‌ బిధూరిపై 3,521 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు.  నిరుడు సెప్టెంబర్​లో అర్వింద్​ కేజ్రీవాల్​ సీఎం పదవిని వదులుకున్న తర్వాత ఆతిశీ బాధ్యతలు చేపట్టారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఆదివారం విజయోత్సవ ర్యాలీలు తీశారు.  కేకులు కట్​ చేస్తూ.. స్వీట్లు పంచారు. తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.