ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి.. జైలులో ఉన్న ఆయనకు.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆప్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జైలు దగ్గరకు తరలివచ్చారు. వారిని చూసి భావోద్వేగానికి గురయ్యారు కేజ్రీవాల్.
భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు కేజ్రీవాల్. జైల్లో ఉన్న సమయంలో వంద రెట్లు బటపడ్డానని.. జైల్లో వేస్తే బలహీనపడ్డాను అనుకుంటే పొరపాటే అన్నారు. దేశానికి సేవ కొనసాగిస్తాను.. దేశాన్ని అమ్మే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతానంటూ శపథం చేశారు కేజ్రీవాల్. నిజాయితీపరుడిని కాబట్టే దేవుడు నాకు మద్దతుగా నిలిచాడని.. మరింత బలంగా ప్రజల కోసం పోరాడుతానన్నారు సీఎం కేజ్రీవాల్.
లిక్కర్ పాలసీ కేసులో ఐదున్నర నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్. సీఎం హోదాలోనే ఆయన జైలులో ఉన్నారు. ఈ కేసును ఈడీ, సీబీఐ విచారించింది. ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.
సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రావటంతో.. ఆప్ సంబరాలు చేసుకున్నది. టపాసులు కాల్చింది. స్వీట్లు పంచింది. పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. న్యాయం గెలిచింది.. కేజ్రీవాల్ బయటకు వచ్చారు అంటూ నినాదాలు చేశారు ఆప్ కార్యకర్తలు.
తీహార్ జైలు దగ్గర వేలాది మంది ఆప్ పార్టీ కార్యకర్తలు.. ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి సత్కరించారు. కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.