- వరుసగా మూడో రోజు ‘సివియర్’
- కేటగిరీలోనే గాలి నాణ్యత పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ
- సమస్యలున్న పేషెంట్లపై తీవ్ర ప్రభావం
- స్టేజ్ 3 ఆంక్షలు అమల్లోకి..ప్రైమరీ స్కూళ్లు బంద్
- అత్యవసరం కాని నిర్మాణపనులపై నిషేధం.. వాహనాలపై ఆంక్షలు
- ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలను మార్చిన ఢిల్లీ సర్కార్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కాలుష్యం కమ్మేసింది. ఎటు చూసినా పొగమంచు అలుముకోవడంతో పట్టపగలు సైతం కొద్ది మీటర్ల దూరంలో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారిన ఢిల్లీ దాదాపు ఒక గ్యాస్ చాంబర్లా మారిపోవడంతో జనం శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విపరీతంగా కమ్మేసిన పొగమంచు కారణంగా వాహనాలు, విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వరుసగా మూడో రోజు కూడా 400కుపైనే నమోదైంది. గాలిలో విషపూరిత వాయువుల శాతం పెరిగిపోయింది. దీంతో పిల్లలు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలు ఉన్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రధాన రోడ్లపై నీటిని స్ప్రే చేస్తుండగా.. మరోవైపు శుక్రవారం నుంచి స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకూ ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల పనివేళలను కూడా వేర్వేరు సమయాలకు మార్చారు. అలాగే ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో అత్యవసరం కాని నిర్మాణ పనులపై నిషేధం విధించారు. పలు రకాల వాహనాల రాకపోకలనూ బ్యాన్ చేశారు.
‘సివియర్’ కేటగిరీలో పొల్యూషన్
ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ గత మూడు రోజులుగా సివియర్ కేటగిరీలో కొనసాగుతోంది. దీంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) కింద శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి స్టేజ్ 3 ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఢిల్లీలో గాలి నాణ్యత 14 రోజులుగా వెరీ పూర్ కేటగిరీలో ఉండగా.. బుధవారం నుంచి సివియర్ కేటగిరీకి చేరింది. ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలోని మొత్తం 39 స్టేషన్లలో 21 స్టేషన్ల వద్ద ఏక్యూఐ సివియర్ కేటగిరీలో ఉండగా.. మరో 4 చోట్ల సివియర్ ప్లస్ కేటగిరీలో నమోదయ్యాయి. నగరంలో శుక్రవారం ఓవరాల్ ఏక్యూఐ 409 పాయింట్లకు చేరింది. నగరంలోని జహంగీర్ పురి, బవానా, వజీర్ పూర్, రోహిణి ఏరియాల్లో ఏక్యూఐ లెవెల్స్ అత్యధికంగా 458, 455, 452గా నమోదయ్యాయి. అయితే, ఓవరాల్ గా గడిచిన 24 గంటల లెక్కలను బట్టి చూస్తే.. గురువారం (432) కన్నా శుక్రవారం గాలి నాణ్యత కాస్త మెరుగుపడినట్టయింది. అయితే, ఢిల్లీలో వాహనాల పొగ, పొరుగు రాష్ట్రాల్లో పంట పొలాల్లో గడ్డిని కాల్చడం, గాలి వేగం తగ్గడం వంటి కారణాల వల్ల కాలుష్యం భారీగా పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు.
ప్రభుత్వ ఆఫీసుల పనివేళల్లో మార్పు
ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసుల పనివేళలను వేర్వేరు సమయాలకు మార్చినట్టు సీఎం ఆతిశీ శుక్రవారం ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ ను తగ్గించేందుకు ఆయా శాఖల ఆఫీసులకు ఉద్యోగుల రాకపోకల సమయాలను మార్చినట్టు తెలిపారు. మార్చిన టైమింగ్స్ ప్రకారం.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఉదయం 8.30కు ఆఫీసులకు వచ్చి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల టైమింగ్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటలకు మారింది. ఇక ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటలకు మార్చారు. కాగా, మెట్రో సర్వీసులను పొడిగించామని, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. అలాగే వీలైనంత వరకూ వాహనాల్లో రాకపోకలను తగ్గించుకోవాలని, సైకిళ్లపై లేదా కాలినడకన, మెట్రో ట్రెయిన్లలో ప్రయాణించాలని సూచించింది.
ఏ స్టేజ్ ఆంక్షలు ఎప్పుడంటే..?
ఏక్యూఐ లెవెల్స్ ను బట్టి గాలి నాణ్యతను పూర్, వెరీ పూర్, సివియర్, సివియర్ ప్లస్ అనే నాలుగు కేటగిరీలుగా పేర్కొంటారు. పూర్ కేటగిరీలో ఉంటే.. స్టేజ్ 1, వెరీ పూర్ లో ఉంటే స్టేజ్ 2, సివియర్ గా ఉంటే స్టేజ్ 3, సివియర్ ప్లస్ కేటగిరీకి చేరితే స్టేజ్ 4 ఆంక్షలను అమలు చేస్తారు.
స్టేజ్ 1: ఏక్యూఐ 201 నుంచి 300 మధ్యకు చేరితే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) కింద స్టేజ్ 1 ఆంక్షలు అమలు చేస్తారు. ప్రజలకు అడ్వైజరీలు జారీ చేయడం, డస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టడం, వ్యర్థాలను కాల్చడంపై ఆంక్షల వంటివి విధిస్తారు.
స్టేజ్ 2: ఏక్యూఐ 301 నుంచి 400 మధ్యకు చేరితే స్టేజ్ 2 ఆంక్షలు అమలులోకి వస్తాయి. డీజిల్ జనరేటర్ సెట్లపై ఆంక్షలు విధిస్తారు. రోడ్లపై నీటిని స్ప్రే చేయడం ప్రారంభిస్తారు.
స్టేజ్ 3: ఏక్యూఐ 400 పాయింట్లను దాటితే.. స్టేజ్ 3 ఆంక్షలను ప్రకటిస్తారు. అత్యవసరం కాని నిర్మాణ పనులను నిషేధిస్తారు. అయితే రైల్వే, మెట్రో, ఎయిర్ పోర్టులు, బస్టాండ్లు, డిఫెన్స్, ఆస్పత్రులు, శానిటేషన్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేపట్టే అత్యవసర నిర్మాణ పనులకు మాత్రం అది కూడా డస్ట్ కంట్రోల్ కు జాగ్రత్తలు తీసుకుంటేనే అనుమతి ఇస్తారు. సిటీలోకి భారీ వాహనాలను అనుమతించరు. ఇటుక బట్టీలు, స్టోన్ క్రషింగ్ పనులనూ నిలిపివేయిస్తారు. రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, మేజర్ వెల్డింగ్, గ్యాస్ కట్టింగ్, పెయింటింగ్, పాలిషింగ్, ప్లాస్టరింగ్, టైల్ వర్క్, వాటర్ ప్రూఫింగ్ వంటి పనులపై, సిమెంట్, ఇసుక, ఫ్లై యాష్ రవాణాపై నిషేధం విధించారు. ఇండోర్స్ లో చేసే చిన్న పనులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
స్టేజ్ 4: కాలుష్యం కట్టడికి విధించే ఆంక్షల్లో ఇదే ఫైనల్ స్టేజ్. ఏక్యూఐ లెవెల్స్ 450 కంటే ఎక్కువకు చేరినప్పుడు స్టేజ్ 4 ఆంక్షలను అమలు చేస్తారు. అన్ని రకాల నిర్మాణ పనులను పూర్తిగా నిషేధిస్తారు. స్కూళ్లను పూర్తిగా మూసేస్తారు. వాహనాల రాకపోకలపై ఆంక్షలు మరింత కఠినం చేస్తారు. ప్రైవేట్ వెహికల్స్ కు సరి, బేసి విధానాన్ని అమలు చేస్తారు.
ఢిల్లీ ‘గ్యాస్ చాంబర్’లా ఉందన్న ప్రియాంక
వయనాడ్ నుంచి ఢిల్లీకి రాగానే తాను గ్యాస్ చాంబర్ లోకి అడుగుపెట్టినట్టు అనిపించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా గురువారం కామెంట్ చేయడం చూస్తే ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల తర్వాత గురువారం ఆమె తిరిగి ఢిల్లీకి వచ్చారు. “వయనాడ్లో ఏక్యూఐ 35 ఉంది. అక్కడి నుంచి ఢిల్లీకి వస్తే.. గ్యాస్ చాంబర్‌లోకి వచ్చినట్టుగా ఉంది. పొగ మంచు మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది” అని ఆమె ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీలో కాలుష్యం ఏటా తీవ్రమవుతోంది. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కాలుష్యం నివారణ కోసం పార్టీలకు అతీతంగా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.