- ఎన్నికల ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్
- విరాళంగా అందుకున్నఢిల్లీ సీఎం ఆతిశి
న్యూఢిల్లీ: ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారం ప్రారంభించిన 24 గంటల్లోనే ఢిల్లీ సీఎం ఆతిశి 19 లక్షల రూపాయలకుపైగా విరాళాలు సేకరించారు. వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆతిశి బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికలకుగాను ఆమె రూ.40 లక్షల ఫండ్ సేకరించాలనే లక్ష్యంతో ఆదివారం ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు.
దీంతో సోమవారం మధ్యాహ్నానికల్లా మొత్తం 455 మంది విరాళాలు అందజేశారు. రూ.19.35 లక్షలు జమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ, పాలనపై ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే మొదటి రోజే ఇంతమొత్తంలో విరాళాలు వచ్చాయని ఆతిశి ట్వీట్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి తాను ఉప్పొంగిపోయానని చెప్పారు.
కల్కాజీ నుంచి ఆతిశి నామినేషన్
ఢిల్లీ సీఎం ఆతిశి కల్కాజీ సెగ్మెంట్నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కల్కాజీ నియోజకవర్గంలో ఆప్ నేత మనీశ్ సిసోడియాతో కలిసి గిరి నగర్లోని గురుద్వారాను, కల్కాజీలోని కాళీ మాత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత చేపట్టిన భారీ ర్యాలీలో ఆతిశి మాట్లాడారు. కల్కాజీ ప్రజలే తన కుటుంబమని అన్నారు. పేదల సంక్షేమానికి ఆప్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగా, కల్కాజీలో బీజేపీ క్యాండిడేట్ రమేశ్ సింగ్ బిదూరి నుంచి ఆతిశి గట్టి పోటీని ఎదుర్కోనున్నారు.